మున్సిపల్ ఎన్నికలలో తెరాస గట్టెక్కగలదా?

October 29, 2019


img

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతించడంతో త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించడంతో చాలా ఉత్సాహంగా ఉన్న తెరాస మున్సిపల్ ఎన్నికలలో కూడా ఘనవిజయం సాధించగలమని పూర్తి నమ్మకంతో ఉంది. 

కానీ హుజూర్‌నగర్‌లో ఉపఎన్నికలు ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం. పైగా అధికార పార్టీ అభ్యర్ధిని ఎన్నుకొన్నట్లయితే మిగిలిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందనే భావనతో ప్రజలు ఓట్లు వేసి ఉండవచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికలు ఏదో ఒక జిల్లాకు, నియోజకవర్గానికి పరిమితమైనవి కావు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో జరుగుతాయి. కనుక ఆ ఎన్నికలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం తప్పకుండా ఉంటుంది. 

ప్రభుత్వం తీరుపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్షాలు, విద్యార్ధి, ప్రజా, కుల సంఘాలు నిలుస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలకే కార్మికులు వారి కుటుంబాలు, వారి బందుమిత్రులు జై కొడతారని వేరే చెప్పనవసరం లేదు. 24 రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో నిత్యం ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతోనో లేక ఆత్మహత్యలు చేసుకోనో మరణిస్తూనే ఉన్నారు. కనుక ప్రజలకు ఆర్టీసీ కార్మికులపై సానుభూతి ఏర్పడటం సహజం. 

ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని హైకోర్టు కూడా పదేపదే తప్పుపడతోంది. కనుక హైకోర్టులో జరుగుతున్న విచారణ, ఆర్టీసీ జేఏసీ నేతల వాదనలు, మీడియాలో మేధావుల విశ్లేషణలు, జిల్లా స్థాయిలో ఆర్టీసీ కార్మికుల వాదనలు ప్రజలను ఆలోచింపజేయడం సహజమే. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక తెరాసకు ఎదురుగాలి వీస్తున్నట్లే కనబడుతోంది. కనుక మున్సిపల్ ఎన్నికలలో తెరాసకు ఎదురీత తప్పకపోవచ్చు. 


Related Post