ఒకే వారంలో నలుగురు ఆర్టీసీ డ్రైవర్లు మృతి

October 25, 2019


img

 టిఎస్ ఆర్టీసీ సమ్మె నానాటికీ ఉదృతమవుతున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. పైగా సమ్మె చేస్తే ఆర్టీసీ మూతపడటం ఖాయమని ఒక్క సంతకంతో వారం రోజులలో 7000 ప్రైవేట్ బస్సులను రోడ్లపైకి తీసుకురాగలనని నిన్ననే ఖరాఖండీగా చెప్పారు. దీంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నార్కట్‌పల్లి డిపోకు చెందిన జమీల్ అనే ఆర్టీసీ డ్రైవర్ గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆర్టీసీ సమ్మె మొదలయ్యి 20 రోజులు గడిచినప్పటికీ సిఎం కేసీఆర్‌ చర్చలు జరిపే ఆలోచన చేయకపోగా ఆర్టీసీని మూసివేస్తామన్నట్లు మాట్లాడుతుండటం, సెప్టెంబర్ జీతాలు చెల్లించనందున ఆర్ధికసమస్యలు వంటి కారణాలతో జమీల్ తీవ్ర ఆందోళన చెందుతుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ వారంలో జమీల్‌తో కలిపి నలుగురు ఆర్టీసీ డ్రైవర్లు గుండెపోటుతో మరణించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఖాజామియా అనే డ్రైవర్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ముషీరాబాద్ డిపో-1కి చెందిన రమేశ్ గౌడ్, నిజామాబాద్‌ డిపో-2కు చెందిన మహమ్మద్ గఫూర్ ఇద్దరూ కూడా మంగళవారం గుండెపోటుతో మరణించారు.

అంతకు ముందు ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోగా, హైదరాబాద్‌లో రాణీగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ కండెక్టర్‌ సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. మరో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు కానీ సాటి కార్మికులు వారిని అడ్డుకొని కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. 20 రోజుల వ్యవధిలో ఆర్టీసీలో ఆరుగురు కార్మికులు చనిపోయినప్పటికీ, సిఎం కేసీఆర్‌ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం, ఎన్నికలప్పుడు అనర్గళంగా మాట్లాడుతుండే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ స్పందించకపోవడం చాలా బాధాకరం. టిఎస్ ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగుస్తుందో...ఈ మృత్యుఘోష ఎప్పటికీ ఆగుతుందో?


Related Post