నిండైన జీవితం జీవించిన సుష్మ

August 07, 2019


img

పరిచయమే అవసరం లేని పేరు సుష్మా స్వరాజ్. ఆమె మంగళవారం రాత్రి డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.  

అనారోగ్యం:  

సుష్మా స్వరాజ్ మధుమేహం కరణంగా రెండు కిడ్నీలు పాడవడంతో 2016లో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నారు. ఆ తరువాత రెండున్నరేళ్ళపాటు ఆమె కేంద్రమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంశలు అందుకున్నారు. కానీ ఆరోగ్యకారణాలతో 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

బాల్యం, చదువులు:

ఆమె స్వస్థలం హరియానాలోని అంబాలా. తల్లితండ్రులు హరిదేవ్ శర్మ, లక్ష్మీదేవి. వారికి 1952, ఫిబ్రవరి 14నా సుష్మా స్వరాజ్ జన్మించారు. బాల్యం నుంచే ఆమె చాలా చురుకుగా ఉండేవారు. సంగీతం, సాహిత్యం, కవిత్వం, నాట్యం, నాటకాలు, లలితకళలపై చాలా ఆసక్తి చూపేవారు. ఆమె విద్యాభ్యాసం అంతా అంబాలాలోనే జరిగింది. విద్యార్ది దశలోనే ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. వక్తృత్వపోటీలు, నాటకాల పోటీలు, సామాజిక అంశాలపై చర్చలలో చురుకుగా పాల్గొంటూ అందరినీ ఆకట్టుకునేవారు. అనేక అవార్డులు పొందారు కూడా. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద డిగ్రీ పొందిన సుష్మా కొంతకాలం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు.

వివాహం, సంసారం: 

సుష్మా 1975 జూలై 13న న్యాయవాదిగా పనిచేస్తున్న స్వరాజ్‌ కౌశల్‌ను వివాహమాడారు. వారికి బన్సూరి అనే ఒక కుమార్తె ఉన్నారు. ఆమె రాజకీయ ఎదుగులకు భర్త ప్రోత్సాహం చాలా ఉంది.  

రాజకీయ ప్రవేశం: 

1970లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితులు విధించడంతో ఆమె దానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో పాల్గొన్నారు. ఆవిధంగా ఆమె రాజకీయాలలోకి ప్రవేశించారు. తొలిసారిగా 1977లో హరియాణా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. అప్పటికి ఆమె వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి హరియానా ముఖ్యమంత్రి దేవీలాల్ ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆమె దానిని చాలా సమర్ధంగా నిర్వహించి అందరి ప్రశంశలు అందుకున్నారు. ఆ తరువాత ఆమె రాజకీయజీవితంలో ఏనాడూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకానేక కీలక పదవులు చేపడుతూ చివరిగా దేశ విదేశాంగమంత్రి పదవిని చేపట్టి కోట్లాది భారతీయులతో పాటు యావత్ ప్రపంచ దేశాల ప్రశంశలు అందుకున్నారు. 

సుష్మా చేపట్టిన పదవులు:

హరియాణా రాష్ట్ర జనతాపార్టీ అధ్యక్షురాలు  (అప్పటికి ఆమె వయసు 27 సం.లు మాత్రమే).

శాసనసభ్యురాలు.

హరియాణా మంత్రి 

రాజ్యసభ సభ్యురాలు (1990)

లోక్‌సభ సభ్యురాలు (1996)

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి (1996)

డిల్లీ శాసనసభ్యురాలు (1998) 

డిల్లీ ముఖ్యమంత్రి  (1998) (తొలి మహిళా ముఖ్యమంత్రి) 

కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి (2000-2003).

లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ ఉపనేత (2009)

విదేశాంగ మంత్రి (2014-2019)

సుష్మా స్వరాజ్ గొప్ప సాహసం, నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళగానే కాక గొప్ప వక్త, మానవతావాదిగా కూడా చాలా గుర్తింపు పొందారు. ఆమె విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు వివిద దేశాల మంత్రులతో, ఐక్యరాజ్యసమితిలో అత్యంత సమర్ధంగా వ్యవహరించిన తీరుకు విదేశీయులు సైతం ఆమెకు ఫిదా అయిపోయేవారు. అద్భుతమైన ఆమె వాగ్ధాటి, వివిద అంశాలపై ఆమెకున్న పట్టు, సరిహద్దులకు అతీతంగా అన్ని దేశాల ప్రజల పట్ల ఆమె కనబరిచిన ప్రేమాభిమానాలు, మానవతావాదం, భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆమె వేషధారణ, ఎంత ఒత్తిడిలో ఉన్న తన క్రింద పనిచేసేవారితో మృదుమదురంగా మాట్లాడేతీరు ఆమె సమున్నత వ్యక్తిత్వానికి కొన్ని నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఆమెకు భారతీయులేకాక భారత్‌ను ద్వేషించే పాక్‌లో కూడా ఆమెకు అనేకమంది అభిమానులు ఉన్నారు. 

ఒక వ్యక్తి ఒక జీవితకాలంలోనే ఇన్ని విజయాలు సాధించి, ఇంత నిండైన జీవితం జీవించడం చాలా అరుదు. అందరి హృదయాలు దోచుకున్న చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఇక శలవంటూ కానరానిలోకాలు తరలివెళ్ళిపోయారు. బుదవారం మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీలో అధికారిక లాంచనాలతో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.


Related Post