కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?

August 03, 2019


img

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం హటాత్తుగా 40,000 మంది సైనికులను తరలించడం, వెనువెంటనే అమర్‌నాథ్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేయడం, శ్రీనగర్‌లోని ఎన్‌.ఐ.టి. క్యాంపస్ లోని విద్యార్దులను తక్షణమే తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఆదేశించడం మొదలైన పరిణామాలతో జమ్ముకశ్మీర్‌లో మళ్ళీ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. 

పుల్వామ తరహాలో భద్రతాదళాల కాన్వాయ్‌పై ఇటీవల ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించడం, అమర్‌నాథ్ యాత్ర మార్గంలో మందుగుండు సామాగ్రి లభించడం, జేఈఎం ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు ఇబ్రహీం అజార్‌ కశ్మీర్‌లో విధ్వంసానికి సిద్దమవుతునట్లు నిఘావర్గాల హెచ్చరికల కారణంగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కేంద్రం నిర్ణయాలను ప్రతిపక్షాలతో పాటు జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం నిర్ణయాలు జమ్ముకశ్మీర్‌ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోందని వారి వాదన. ఈ తాజా పరిణామాలను చూస్తున్న కశ్మీర్‌ ప్రజలు నిజంగానే చాలా ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా నిత్యావసర సరకులు కొనితెచ్చుకొని నిలువ చేసుకొంటున్నారు. సాయంత్రం చీకటిపడక మునుపే కశ్మీర్‌లో దుకాణాలు బంద్‌ అవుతున్నట్లు సమాచారం. 

కానీ కేంద్రప్రభుత్వం ఎందుకు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుందో తెలుసుకోకుండా సున్నితమైన ఈ అంశంపై ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం చాలా శోచనీయం. ఒకవేళ కేంద్రప్రభుత్వం కూడా ప్రతిపక్షాలలాగే భావిస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, అప్పుడు ఉగ్రవాదులు పెనువిధ్వంసం సృష్టిస్తే, దానిలో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, అప్పుడు ఇవే ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వం చాలా భాద్యతారాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించకమానవు. కనుక చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే అటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా నివారించే ప్రయత్నలౌ చేస్తున్న కేంద్రప్రభుత్వాన్ని విమర్శిచడం సరికాదనే చెప్పాలి. ఇది బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా లేక నిజంగానే దేశభద్రత కోసం తీసుకున్న నిర్ణయమా? ఇది సరైన నిర్ణయమేనా కాదా? అనే విషయం త్వరలోనే తేలిపోతుంది. కనుక అంతవరకు ప్రతిపక్షాలు ఓపికపడితే బాగుంటుంది. 


Related Post