ముగ్గురూ ఏం మాట్లాడుకున్నారో?

August 02, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి జెరుసలెం బయలుదేరి వెళ్ళేముందు హైదరాబాద్‌లో మొదట తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఆయన ఇప్పుడు ఏపీకి గవర్నర్‌ కానప్పటికీ ఆయనతో జగన్‌ సుమారు గంటసేపు సమావేశమయ్యారు. వారిరువురూ దేని గురించి మాట్లాడుకున్నారో తెలియదు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రగతి భవన్‌ వెళ్ళి సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వారిరువురూ సుమారు 3 గంటల సేపు ఏకాంతంగా చర్చించుకొన్నట్లు సమాచారం. వారిరువురు ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక విభజన సమస్యలు, వర్తమాన రాజకీయ పరిస్థితులు, గోదావరీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లింపు తదితర వ్యవహారాలపై మాట్లాడుకొని ఉండవచ్చు. అయితే వారి భేటీలలో ఆ ముగ్గురూ ఏమి మాట్లాడుకున్నారనే దానిపై ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు కనుక వారి భేటీ గురించి మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలుగానే భావించవలసి ఉంటుంది.

జగన్‌ ఏపీ సిఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నందున అప్పుడే విమర్శల పాలవుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయనకు సలహాలు ఇచ్చే ధైర్యం పార్టీలో, ప్రభుత్వంలో ఎవరికీ లేదు కనుక ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కేసీఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన సలహాలు సూచనలు చేసి మార్గదర్శనం చేసి ఉండవచ్చు. కనుక జగన్‌ ప్రభుత్వ వైఖరి, విధానాలలో ఏవైనా అనూహ్య మార్పులు వస్తే అవి గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కేసీఆర్‌ల సలహాల మేరకు జరిగినవిగా భావించవచ్చు.


Related Post