భవిష్య రాజకీయాలు ఇలాగే ఉండబోతున్నాయా?

August 01, 2019


img

మన దేశంలో రాజకీయపార్టీలన్నీ ఒక్కో ఎన్నికలకు ఒక్కో మెట్టు చొప్పున దిగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు రాజకీయ పార్టీలను కార్యకర్తల స్థాయి నుంచి నిర్మించుకునేవారు కానీ ఇప్పుడు ఇతర పార్టీల నేతలను, ప్రజాప్రతినిధులను నయన్నో భయన్నో లొంగదీసుకొని పార్టీలో చేర్చుకోవడం ద్వారా సులువుగా పార్టీలను బలోపేతం చేసుకునే ట్రెండ్ నడుస్తోంది. అవకాశవాదులైనా పరువాలేదు ఎన్నికలలో పార్టీని గెలిపించి అధికారంలోకి తేగలిగితే అంతే చాలు..అన్నట్లు వ్యవహరిస్తున్నాయి అన్ని పార్టీలు. 

ఎన్నికలలో గెలిచినవారు అదే పార్టీలో ఉంటారనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఒక పార్టీ అభ్యర్ధికి ఓట్లేసి గెలిపిస్తే అతను లేదా ఆమె వేరే పార్టీలో చేరిపోతుండటంతో వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిప్రాయాలకి విలువలేకుండా పోతోంది. కానీ ‘ఏ పార్టీ గెలిస్తే దానిలోకి వెళ్లిపోవడమే ప్రజాభిప్రాయానికి మన్నించడం’ అనే సరికొత్త వితండవాదన మొదలైంది. ఆ వాదన వింటున్న ప్రజలకు వారు తమను మోసం చేస్తున్నారా లేక తమకోసమే వారు పార్టీ మారారా? అనే సందిగ్ధంలో పడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి మారిపోతారో తెలియని పరిస్థితి నెలకొని ఉన్నందున ఈమాత్రం దానికి లక్షల కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నవారు కూడా ఉన్నారు. 

ఒకప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే నేతలు ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టేవారు. ఇప్పటికీ ప్రజలు ఓట్లు వేస్తూనే ఉన్నారు కానీ వారి ఓట్లతో ప్రమేయం లేకుండా ఈవీఎం మేనేజ్మెంట్ ద్వారా కూడా అధికారం సంపాదించుకోవచ్చునని ప్రతిపక్షపార్టీలు బహిరంగంగానే చెపుతున్నాయి. కనుక ఎన్నికలకు అర్ధమే లేకుండా పోయింది. 

అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారిపోయింది. అన్ని వ్యవస్థలను గుప్పెట్లోకి తీసుకొని ప్రత్యర్ధులను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రక్రియను అనుకూలంగా నడిపించుకునే పద్దతులు కనబడుతున్నాయి. ఇటువంటి అప్రజాస్వామిక, అనైతిక రాజకీయాలకు ‘ఎన్నికల వ్యూహాల’నే అందమైన పేరు పెట్టుకొని వాటిని అందరూ ఆస్వాదిస్తుండటం ఇంకా దురదృష్టకరం.     

అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయాలను చూస్తుంటే భవిష్యత్ రాజకీయాలు ఇంతకంటే దారుణంగానే సాగవచ్చునని అర్ధం అవుతుంది.


Related Post