తెరాస-బిజెపిల యుద్ధాల పరమార్ధం ఏమిటో?

April 03, 2019


img

గత 5 ఏళ్ళుగా సిఎం కేసీఆర్‌-ప్రధాని నరేంద్రమోడీల మద్య అలాగే...తెలంగాణ ప్రభుత్వం-కేంద్రప్రభుత్వం మద్య చాలా చక్కటి సంబంధాలు కొనసాగాయి. అది తెరాస-బిజెపిల మద్య ఉన్న రహస్య అవగాహనకు అద్దం పడుతోందని కాంగ్రెస్‌ తదితర పార్టీలు వాదిస్తే, అది కేవలం పాలనాపరంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఉన్న సంబందాలు మాత్రమేనని తెరాస సమర్ధించుకొనేది. 

కానీ కేంద్రప్రభుత్వం క్లిష్టపరిస్థితులెదుర్కొన్న ప్రతీసారి మోడీ ప్రభుత్వానికి తెరాస అండగా నిలబడింది. దానినీ కేసీఆర్‌ తనదైన శైలిలో సమర్ధించుకొన్నారు. “కేంద్రప్రభుత్వం యావత్ దేశానికి వర్తించే నిర్ణయాలను అమలుచేయాలనుకొన్నప్పుడు వాటిని అడ్డుకోలేము కనుక ఆ నిర్ణయాలను వ్యతిరేకించి ప్రజలలో గందరగోళం సృష్టించడం మంచి కాదనే ఉద్దేశ్యంతో వాటి వలన ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఏమేమి చేయవచ్చో ఆ పనులు చేశామని” చెప్పారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయాలను తెరాస ఎందుకు సమర్ధించిందో చెప్పనే లేదు. 

కేసీఆర్‌-ప్రధాని నరేంద్రమోడీల మద్య ఉన్న చక్కటి ఈ అవగాహన వలననే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు శరవేగంగా మంజూరు చేసింది. తెరాస ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రప్రభుత్వం తక్షణం ఆమోదం తెలిపింది. 

నిన్న మొన్నటి వరకు ఆప్త మిత్రులులా వ్యవహరించిన కేసీఆర్‌-నరేంద్రమోడీ, లోక్ సభ ఎన్నికలు రాగానే హటాత్తుగా ఆగర్భ శత్రువులుగా ఎలా మారిపోయారు? అని సందేహం కలుగక మానదు. వారిరువురే కాదు...యదారాజా తదాప్రజా అన్నట్లు తెరాస-బిజెపి నేతలు కూడా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొంటున్నారు. 

తెరాస-బిజెపి నేతలు ప్రస్తుతం పోరాడుకొంటున్న తీరు చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ ఎట్టిపరిస్థితులలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వరనిపిస్తుంది. నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా అడ్డుకోవడం ఖాయం అనిపిస్తుంది. కానీ కేసీఆర్‌-నరేంద్రమోడీల మద్య ఉన్న సత్సంబంధాల నేపధ్యంలో చూసినట్లయితే, ఆ రెండు పార్టీలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే శత్రువులలా పోరాడుకొంటున్నట్లు నటిస్తున్నాయనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానం నిజమో కాదో మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలుస్తుంది. 


Related Post