దాదాపు నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మూడు ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నియామావళి ప్రకారం నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగుస్తుంది. కనుక నేడు మూడు పార్టీలు మరింత ఉదృతంగా ప్రచారం చేయనున్నాయి.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరు ముగ్గురూ కాక మరో 55 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. అయితే పోటీ ప్రధానం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే సాగేలా ఉంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చినప్పటి నుంచి బీజేపి ఎన్నికల ప్రచారం కూడా జోరందుకుంది. ఆయన నియోజకవర్గంలో హిందూ ఓటర్లను ఆలోచింపజేసేలా ప్రసంగిస్తూ ఆకట్టుకుంటున్నారు. కనుక నియోజకవర్గంలో హిందూ ఓటర్లలో పెద్ద చీలిక ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పడాల్సిన ఓట్లు ఆ మేరకు తగ్గిపోతాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో సుమారు 60,000 మంది ముస్లిం ఓటర్లను, అలాగే దివంగత నేత పీ. జనార్ధన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులను, బీసీలను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అవినీతి, అసమర్ధతను ఎత్తి చూపుతూ తీవ్ర విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హైడ్రా కూల్చివేతలను పదేపదే ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలను తమ వైపు తిప్పుకుంటున్నారు.
కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ఈ సీటు దక్కించుకునేందుకు మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుకుంటున్నాయి. వాటిలో ఏది గెలుస్తుందనేది ఈ నెల 14న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.