దేశంలో మొదట ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ తర్వాత దేశంలో పలు విమానాశ్రయాలలో కూడా ఇదే సమస్య తలెత్తుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా వందల కొద్దీ విమానాలు రద్దవుతున్నాయి లేదా 10-12 గంటలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి వియత్నాం బయలుదేరాల్సిన విమానం శనివారం ఉదయానికి కూడా బయలుదేరలేకపోయిందంటే సమస్య తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో విమానాలు ఫ్లైట్ ప్లాన్ నియంత్రించే ‘ఆటోమేటిక్ స్విచ్చింగ్’ సాఫ్ట్ వేర్ ఉంటుంది. దానిలో సాంకేతిక లోపం ఏర్పడటంతో సిబ్బంది స్వయంగా ప్రతీ విమానాన్ని ప్లాన్ చేసి పంపించాల్సి వస్తోంది. అందువల్లే విమానాలు చాలా ఆలస్యమవుతున్నాయి.
ఈ సమస్యని పరిష్కరించడానికి సంబంధిత ఐటి నిపుణులు కృషి చేస్తున్నారు. కానీ శనివారం సాయంత్రం వరకు కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. కనుక ఇంకా ఎంత సమయం పడుతుందో తెలీదు. అంతవరకు విమాన ప్రయాణికులకు తిప్పలు తప్పవు.