ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతిలోని అటవీ ప్రాంతంలో పర్యటించి ఎర్ర చందనం తదితర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడవిలో ఎర్రచందనం చెట్లను, స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకొని అటవీశాఖ గోదాముల్లో నిలువచేసిన ఎర్రచందనం దుంగలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “గత ప్రభుత్వం హయంలో 5 ఏళ్ళ పాటు నిరాటంకంగా లక్షల ఎర్ర చందనం చెట్లను నరికివేశారు. లక్షల టన్నుల ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది. ఇప్పటికే కొందరు స్మగ్లర్లను గుర్తించాము. వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఎర్ర చందనం దేశ సంపద. దానిని కొల్లగొట్టి స్మగ్లింగ్ చేస్తుంటే ఏపీ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఈ లైన్లో ఉన్న అందరికీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. కానీ ఇకపై తిరుపతి అడవుల్లో ప్రవేశించి ఎర్ర చందనం చెట్లను నరకాలని ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అడవులలో మావోయిస్టులను ఏవిదంగా ఏరిపారేసిందో అదేవిదంగా ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ వంటిది చేపట్టి ఏరిపారేస్తుంది,” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప-1,2 రెండూ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కధే. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పని హీరోగా, అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి ఎస్పీ భన్వర్ సింగ్ విలన్ అన్నట్లు చూపారు.
పోలీసులను ఎదిరించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం చాలా గొప్ప విషయమనట్లు పుష్పలో చూపారు. అలాంటి స్మగ్లర్స్, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వానికి మద్య ఉన్న సంబంధాలు కూడా సినిమాలో చూపారు. వాస్తవ ఘటనల ఆధారంగానే ఆ సినిమా తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. నేడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు.
కనుక ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపడం అంత సులువు కాదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆపరేషన్ కగార్ చేపడితేనే ఆగుతుంది. కానీ ప్రభుత్వం మారితే మళ్ళీ మొదలవుతుంది కూడా.
తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి… pic.twitter.com/OPv936UetV