వీళ్ళా సెలబ్రెటీలు? వీసీ సజ్జనార్‌ ప్రశ్న

November 07, 2025
img

క్రికెట్, సినీ రంగాలలో ఉన్న పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ భారీగా పారితోషికాలు తీసుకున్నారు. కానీ వారి ప్రకటనలు చూసి సామాన్య ప్రజలు, యువత, ముఖ్యంగా వారి అభిమానులు ‘బెట్టింగ్ యాప్స్’లో భారీగా డబ్బు పెట్టి జూదం ఆడుతూ సర్వస్వం కోల్పోతున్నారు. కొందరు కుటుంబాలతో సహా రోడ్డున పడితే, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ‘బెట్టింగ్ యాప్స్’ వలన దేశంలో కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయి. 

దీనిపై ఈడీ తీవ్రంగా స్పందిస్తూ వాటి నిర్వాహకులపై, వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ ‘బెట్టింగ్ యాప్స్’ని ప్రమోట్ చేసి భారీగా పారితోషికాలు తీసుకున్న ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను ఈడీ విచారించిన తర్వాత వారికి చెందిన రూ.11.4 కోట్లు విలువగల ఆస్తులను జప్తు చేసింది. ఇంకా యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప తదితరులని ఈడీ విచారిస్తోంది. 

హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ వార్తని ట్యాగ్ చేస్తూ “వీళ్ళా సెలబ్రెటీలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆద‌ర్శ‌నీయ‌మైన ఆట‌గాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్య‌స‌న‌ప‌రులై ఎంతో మంది యువ‌కులు త‌మ జీవితాల‌ను చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. స‌మాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్ర‌చారం చేసిన వీరు వీట‌న్నింటికీ బాధ్యులు కారా? స‌మాజ మేలు కోసం, యువ‌త ఉన్న‌త‌ స్థానాలకు చేరుకోవ‌డానికి నాలుగు మంచి మాట‌లు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను త‌ప్పుదోవ‌ప‌ట్టించి వారి ప్రాణాల‌ను తీయకండి,” అంటూ హితవు పలికారు. 

Related Post