అమెజాన్ ప్రైమ్ టీవీలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లలో ఫ్యామిలీ మ్యాన్-1,2 కూడా ఒకటి. రాజ్, డికె దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగుతో సహా చాలా భాషలలో విడుదలైంది. అన్ని భాషలలో సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్-3 రాబోతోంది. ఈ నెల 21న అమెజాన్ ప్రైమ్ టీవీలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్యామిలీ మ్యాన్-3 ట్రైలర్ విడుదల చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు స్మగ్లింగ్ ఏవిదంగా జరుగుతుందో ఫ్యామిలీ మ్యాన్-3లో చూపబోతున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి ఇద్దరు పిల్లలు కలిగిన దంపతులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేశాన్ని కాపాడేందుకు థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ అధికారిగా ఉగ్రవాదులను కనిపెట్టి మట్టుబెట్టే ఆపరేషన్స్ లో శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పేయి) పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ విషయం ఇంట్లో వారికి తెలియనీయకుండా ఓ సాధారణ మధ్య తరగతి గృహస్తుగా జీవిస్తుంటాడు.
కనుక ఎదుగూ బొదుగూ లేని జీతం, ఉద్యోగం చేస్తున్నాడని భార్య, పిల్లలు చిరుబురులాడుతుంటే అతను వారిని మేనేజ్ చేయడానికి పడే తిప్పలు చాలా సరదా సరదాగా సాగుతుంటాయి. అందుకే ఈ వెబ్ సిరీస్‌కి ఫ్యామిలీ మ్యాన్ టైటిల్ అని పెట్టారు. కానీ ఫ్యామిలీ మ్యాన్-3లో తానొక సీక్రెట్ ఏజంట్‌ననే విషయం భార్య, పిల్లలకి చెప్పడం, ఆ తర్వాత ఓ ఆపరేషన్‌లో శ్రీకాంత్ తివారీ అరెస్ట్ అయినట్లు ట్రైలర్‌లో చూపడంతో సస్పెన్స్ క్రియేట్ చేశారు దర్శకులు రాజ్ అండ్ డికె.
ఫ్యామిలీ మ్యాన్-3లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, షరీఫ్ హష్మీ, అశ్లేష్ ఠాకూర్, శరద్ ఖేల్ఖర్, సందీప్ కిషన్, గుల్ పనాగ్, శ్రేయ ధన్వంతరీ, సన్నీ హిందూజా, అభయ్ వర్మ నటించారు.