రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే సంగతి తెలుసు కానీ ఆయన అత్యంత క్రూరమైన, శక్తివంతుడైన విలన్‌గా నటిస్తున్నారనే సంగతి ఈరోజు రాజమౌళి చెప్పేవరకు ఎవరికీ తెలియదు.
ఎవరూ ఊహించని విధంగా రాజమౌళి స్వయంగా ఎస్ఎస్ఎంబీ29 (గ్లోబ్ ట్రోటర్) నుంచి పృద్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ కుంభగా నటిస్తున్న పృద్విరాజ్ సుకుమారన్ నడవలేని స్థితిలో ఉంటారు. కేవలం కుడి చేయి మాత్రమే పనిచేస్తుంది. అనేక ఆయుధాలు బిగించబడిన యాంత్రికంగా కదిలే వీల్ చైర్‌లో కూర్చొని పోరాటాలు చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపారు. ఇది ఎవరూ ఊహించనిదే కదా?
రాజమౌళి ఈ ఫోటోతో పాటు ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకున్నారు. “ఈ క్లైమాక్స్ సీన్ మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత నేను సుకుమారన్ వద్దకు వెళ్ళి ఇంతవరకు నేను చూసిన గొప్ప నటులలో మీరూ ఒకరని చెప్పాను. ” ఆ వీల్ చైర్‌లో కూర్చొని కుంభ వంటి క్రూరమైన విలన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినందుకు మీకు ధన్యవాదాలు,” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఈ నెల 14 సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ తన అవతార్-3 ప్రమోషన్స్ కోసం భారత్‌కి రానున్నారు. కనుక ఆయన చేత ఈ సినిమా టైటిల్, పోస్టర్ విడుదల చేయాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబీ29కి ‘వారణాసి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం.