టీ-కాంగ్రెస్ నేతలు వితండ వాదన చేస్తున్నారా?

July 21, 2016


img

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ గట్టి సవాలే విసురుతోందని చెప్పక తప్పదు. హర్యాణా రాష్ట్రంలో పర్యటించి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, అక్కడ ఎటువంటి ఆనకట్టలు నిర్మించకుండా జవహార్ లాల్ నెహ్రు ఎత్తిపోతల పధకాలు ఏ విధంగా 4-6 లక్షల ఎకరాలకి నీళ్ళు  అందిస్తున్నాయో వివరిస్తున్నారు. ఆ విధంగా చేయడం వలన ఆనకట్టలు కట్టడానికి భూసేకరణ చేయవలసిన అవసరం ఉండదు. కనుక రైతులకి కోట్లాది రూపాయలు నష్టపరిహారం చెల్లించనవసరం ఉండదు. వేల కోట్లు ఖర్చు చేసి ఆనకట్టలు నిర్మించనవసరం లేదు. ఆ విధంగా లక్షల ఎకరాలకి గ్రావిటీ పద్ధతిలో, అవసరమైన చోట పంపుల ద్వారా నీళ్ళు అందించవచ్చని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకి కూడా మేలు కలుగుతుందని వారు వాదిస్తున్నారు.

హర్యాణాలో ఈ విధానం ఏ విధంగా చిరకాలంగా అమలు అవుతోందో తెలుపుతూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కూడా వివరిస్తుండటంతో ప్రజలు కూడా వారి వాదనలతో ఏకీభవిస్తున్నారు. ఆ కారణంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కూడా సందిగ్ధంలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల వాదనలని కొట్టిపడేశారు. వారు కనీసం అవగాహన కూడా లేకుండా వాదిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఆరు దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి తప్ప మరేమీ చేయకపోయినా, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు.

హర్యాణా, తెలంగాణ రాష్ట్రాల మధ్య  భౌగోళిక పరిస్థితులలో ఉన్న తేడా గురించి ఏ మాత్రం వారికి అవగాహన లేదని వారి మాటలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. వారి నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా, తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పూర్తిచేసి తెలంగాణలో రైతులకి నీళ్ళు అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, తెరాస వాదనలలో ఏది సరైనదో సామాన్యులు చెప్పలేకపోయినా, కాంగ్రెస్ నేతల వాదనలు విన్న తరువాత కొన్ని సందేహాలు కలగడం సహజం.

హర్యాణా పద్ధతిలో ఆనకట్టలు కట్టకుండానే పంటలకి సాగునీరు అందించవచ్చని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు, అదే పని తమ ప్రభుత్వ హయంలో ఎందుకు చేయలేదు? అప్పుడు లక్షల కోట్లు పెట్టి జలయజ్ఞం పేరిట అనేక ప్రాజెక్టులు ఎందుకు మొదలుపెట్టారు? అప్పుడు అవసరమైన ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు అనవసరం అనిపిస్తున్నాయి? ప్రాజెక్టులు కట్టడం అంటే జేబులో డబ్బు వేసుకోవడానికే అయితే అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎంత వెనకేసుకొన్నారో వారే చెప్పాలి.


Related Post