గుణాత్మకమైన మార్పు అంటే ఇదేనా?

March 27, 2019


img

సిఎం కేసీఆర్‌లో ఒక రచయిత కూడా ఉన్నాడనే సంగతి అందరికీ తెలుసు. ఆయన సృష్టించిన బంగారి తెలంగాణ, రాజకీయ పునరేకీకరణ, గుణాత్మకమైన మార్పు వంటి కొత్త పదాలను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. మొదటి రెండు పదాలకు అర్ధం ఇప్పటికే ప్రజలకు అర్ధమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా బాగా అర్ధమైంది. 

దేశరాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ అనే పదానికి అర్ధం లేదా తాత్పర్యం ‘కేసీఆర్‌ ప్రధానమంత్రి కావడం’ అని ఇప్పుడిపుడే అర్ధం అవుతోంది. అయితే ఈవిషయం ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లయితే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆ ఊహాజనితమైన ‘గుణాత్మకమైన మార్పు’ కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ ముందుకు సాగినట్లున్నారు. 

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడిన తరువాత తెరాసలోనే ‘గుణాత్మకమైన మార్పు’ కనబడటం మొదలైంది. తెరాస నేతలు ఇప్పుడు కేంద్రం మెడలు వంచుతామని, డిల్లీలో చక్రం తిప్పుతామంటున్నారు. అది మొదటి ‘గుణాత్మకమైన మార్పు’ అనుకొంటే, ‘మట్టి మోసేవాడైన మనవాడే ఉండాలని కోరుకొన్నప్పుడు, మనవాడే ప్రధానమంత్రి అవ్వాలని కోరుకోవడంలో తప్పేమిటి?’ అనే వాదన మరో ‘గుణాత్మకమైన మార్పు’గా చెప్పుకోవచ్చు. 

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. బిజెపికి వేస్తే నరేంద్రమోడీ అవుతారు. అదే తెరాసకు వేస్తే తెలంగాణ రాష్ట్రం, ప్రజలు లాభపడతారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో “సారు...కారు.. పదహారు” అనే మన నినాదంతో ముందుకుసాగి 16 మంది ఎంపీలను గెలిపించుకొందాము. మనం 16 గెలుచుకొంటే, దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలను వ్యతిరేకిస్తున్న పార్టీల నుంచి మనకు మరో 150 మంది ఎంపీలు కలుస్తారు. అప్పుడు మన నాయకుడు కేసీఆర్‌ను డిల్లీ పంపించి దేశానికి దశదిశా నిర్దేశించేలా చేద్దాం,” అని అన్నారు. 

ఒకవేళ 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్‌ ప్రధానమంత్రి అవుతారని కేటీఆర్‌ ఖచ్చితంగా చెప్పగలిగితే, తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా వారికే ఓట్లేసి గెలిపిస్తారు. 

కానీ కేటీఆర్‌ చెపుతున్నట్లుగా ఒకవేళ ఇతర పార్టీలకు చెందిన 150 మంది ఎంపీలు కేసీఆర్‌తో చేతులు కలిపినా, ఆ సంఖ్యతో కేసీఆర్‌ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు కనుక  ‘కింగ్ మేకర్’ కావచ్చునేమో కానీ ప్రధాని కాలేరు. అది కూడా మిగిలిన పార్టీలన్నీ ఆయన చెప్పినట్లు నడుచుకొనేందుకు అంగీకరిస్తేనే సాధ్యం అవుతుంది. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయమని కేసీఆర్‌ పదేపదే చెపుతున్నారు కనుక ఆయన ఆ మాటకు కట్టుబడి ఉండదలిస్తే ఆ రెండు పార్టీలకు ఎట్టి పరిస్థితులలో మద్దతు ఇవ్వకూడదు. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా ఉంటారనుకొంటున్న మాయావతి, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ మాటకు కట్టుబడి కాంగ్రెస్‌, బిజెపిలకు దూరంగా ఉండమంటే ఉంటారా? అయినా కేసీఆర్‌ కోరినట్లు వారు నడుచుకోవలసిన అవసరం ఏమిటి? నడుచుకొంటారనే గ్యారెంటీ ఏమిటి? అనే సందేహాలు కలుగుతాయి.

ఎందుకంటే, ఫెడరల్‌ ఫ్రంట్‌లో అతి తక్కువ ఎంపీ సీట్లు కలిగిన పార్టీ తెరాసయే కనుక. ఒకవేళ కేసీఆర్‌ ఊహించినట్లు ఏపీలో వైసీపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తే వైసీపీ కంటే కూడా తెరాసకు తక్కువ మంది ఎంపీలుంటారన్న మాట! యూపీ (80), పశ్చిమబెంగాల్ (42), ఒడిశా (21) ఎంపీ సీట్లున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలలో ప్రధానమంత్రి పదవి ఆశిస్తున్న మాయావతి, మమతా బెనర్జీ వంటి నేతల మాట నెగ్గుతుందా లేక 16 ఎంపీ సీట్లున్న కేసీఆర్‌ మాట నెగ్గుతుందా? మరి కేసీఆర్‌ ఏవిధంగా ప్రధానమంత్రి కాగలరు? మరి 16 మంది ఎంపీలతో ఏవిధంగా గుణాత్మకమైన మార్పు సాధించగలరు? అనే ప్రశ్నలకు తెరాస నేతలు ఇప్పుడు జవాబు చెప్పకపోవచ్చు కానీ కాలం తప్పకుండా సమాధానాలు చెపుతుంది.

అయితే ఒక్కటి మాత్రం నిజం. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనతో కేసీఆర్‌ ప్రధానమంత్రి కాలేకపోయినా ఈవాదనలతో లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొనే అవకాశాలు పెరుగుతాయి. బహుశః దానినే గుణాత్మకమైన మార్పు అనుకోవాలేమో?


Related Post