తెలంగాణ తెదేపాకి కొత్త స్నేహితుడు ప్రొఫెసర్ కోదండరాం?

July 20, 2016


img

శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడనే సిద్దాంతాన్ని మన రాజకీయ పార్టీలు చాలా చక్కగా ఆకళింపు చేసుకొన్నాయని చెప్పవచ్చు. తెలంగాణలో తెరాసకి, ఆంధ్రాలో వైకాపాకి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే కనుక ఆ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. అలాగే తెలంగాణలో తెరాస ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఉమ్మడి శత్రువు కనుక ఎన్నికల సమయంలో అవన్నీ చేతులు కలుపుతుంటాయి. అలాగే తెరాస ప్రభుత్వాన్ని ఇటీవల కొంచెం గట్టిగా వ్యతిరేకిస్తున్న కారణంగా ప్రొఫెసర్ కోదండరాం ని తెదేపాకి కొత్త స్నేహితుడిగా గుర్తించినట్లుంది.

తెలంగాణ తెదేపా నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మొన్న శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యాలయంలో సమావేశమయినప్పుడు, ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఆయనని ఆదర్శంగా తీసుకొని తెదేపా నేతలు అందరూ తెరాస ప్రభుత్వంతో పోరాడాలని చంద్రబాబు తన నేతలకు సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ప్రజల అవసరాలు, వారి సాధకబాధకాల గురించి బాగా తెలిసున్న ప్రొఫెసర్ కోదండరాం వంటివారే తెరాస ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పుడు మీరు కూడా గట్టిగా పోరాటం చేయవచ్చని చంద్రబాబు తెదేపా నేతలకి సూచించినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణకి చెందిన ప్రొఫెసర్ కోదండరాం ని మెచ్చుకొన్నారంటే అందుకు కారణం పైన చెప్పుకొన్నదే. కనుక మున్ముందు తెలంగాణ తెదేపా నేతలు ఆయనకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి కనుసన్నలలో నడుస్తున్న తెదేపా నేతలతో ఆయన చేతులు కలపడానికి ఇష్టపడకపోవచ్చు.

ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణలో తెదేపా మళ్ళీ బలపడటం అసాధ్యంగానే కనిపిస్తోంది. అయినా బలపడాలనుకొంటే, ముందుగా అది ఏపి నేతల ఆధిపత్యం నుంచి బయటపడాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు కనుక ఇదీ సాధ్యం కాదనే చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలకి, తన పార్టీకి దూరం కావడానికి ప్రధాన కారణం ఓటుకి నోటు కేసే అయినప్పటికీ, తన పార్టీపై ఉన్న ఆంధ్ర పార్టీ ముద్రని తొలగించాలనే ఆలోచన కూడా ఒక కారణమేనని భావించవచ్చు. కానీ అందుకోసం ఆయన చేసిన త్యాగం వలన పార్టీ బలపడకపోగా ఇంకా బలహీనపడి అనాధగా మారిపోవడంతో, ఆ పార్టీలో చాలా మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవడం కోసం బంగారు తెలంగాణ పడవలోకి ఎక్కిపోయారు.

అందరూ కలిసి కష్టపడి పనిచేస్తే తెలంగాణలో మళ్ళీ తెదేపా బలపరుచుకొని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు నాయుడు తెలంగాణ తెదేపా నేతలకి కొత్తబంగారులోకం చూపించే ప్రయత్నం చేశారు కానీ అది అంత తేలిక కాదని ఆయనకీ తెలుసు. తెలంగాణలో తెదేపా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోందో ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈలోగా ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని ఆకర్షించగలిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ అదీ కష్టమే.


Related Post