భారత ప్రజల కష్టార్జితం కావాలి కానీ భారత్ వద్దా?

February 25, 2019


img

స్వాతంత్ర్యం తరువాత అప్పటి పాలకులు తీసుకొన్న తప్పుడు నిర్ణయాల వలన నేటికీ కశ్మీర్ సమస్య రావణకాష్టంలా రగులుతోంది. ఆనాడు కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ ఆర్టికల్ 35ఏను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు భారత్‌కు శాపంగా మారింది. 

కోట్లాదిమంది భారతీయుల కష్టార్జితంతో కడుతున్న పన్నులను, కేంద్రప్రభుత్వం అందిస్తున్న సేవలను, సంక్షేమపధకాలను, మన రక్షణ బలగాలు ఆపత్సమయంలో అందిస్తున్న సేవలను చాలా సంతోషంగా, నిరభ్యంతరంగా స్వీకరిస్తున్న జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం, కశ్మీర్‌ ప్రజలు తమ వ్యవహారాలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని వాదిస్తుంటారు. 

వారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు..ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవచ్చు...స్థిరపడవచ్చు కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు, చివరికి మన భద్రతాదళాలు కూడా కశ్మీర్‌లో అడుగుపెట్టడాన్ని వారు సహించరు. అక్కడి వేర్పాటువాదులకు మొన్నటి వరకు కేంద్రప్రభుత్వమే భద్రత, సౌకర్యాలు వగైరా కల్పించేది. వారికి ఏవైనా రోగాలు వస్తే డిల్లీకి...వీలైతే ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు వెళ్ళి ఖరీదైన ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకొంటారు. కానీ భారత ప్రభుత్వం అంటే వారెవరికీ గిట్టదు. కానీ వారి బాతులను బుగ్గి చేస్తున్న పాకిస్థాన్‌ అంటేనే వారికి ఎంతో ప్రీతి. 

వారు కశ్మీర్‌ యువతకు దశాబ్ధాలుగా భారత్ పట్ల ద్వేషభావం నూరిపోస్తున్నారు. ఆకారణంగా వేర్పాటువాదులతో, ఉగ్రవాదులతో కలిసి తిరుగుతూ యువత తమ బంగారు భవిష్యత్తును చేజేతులా  నాశనం చేసుకొంటున్నారు. ప్రజల వేర్పాటువాదుల, ఉగ్రవాదుల మద్య సన్నటిరేఖ తుడిచివేయడంతో వారిని చూసి కశ్మీర్‌ పాలకులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. 

వారందరి ఒత్తిడి కారణంగా జమ్ముకశ్మీర్‌ పాలకులు కూడా వేర్పాటుగీతం ఆలపిస్తుంటారు. పాకిస్థాన్‌కు జిందాబాద్ అంటుంటారు. ఇంతకీ భారత్ చేసిన పాపం ఏమిటంటే వారందరినీ ఉదారంగా పెంచి పోషించడమే. 

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని ఏలుతున్న పాలకులు దేశప్రయోజనాల కంటే స్వార్ధరాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండటం వలన చల్లగా..ఎంతో ఆహ్లాదంగా ఉండవలసిన కశ్మీర్‌ నిప్పుల కొలిమిలా భగభగమండుతూ మన చేతులను కాల్చూతూనే ఉంది. 

పుల్వామా దాడి తరువాత కటిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నమాటలు అక్షరసత్యాలు. భారత్ దేశానికి- కశ్మీర్‌కు మద్య అడ్డుగోడగా నిలిచిన ఆర్టికల్ 35ఏ ను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంతో కశ్మీర్‌ ప్రజలు, స్థానిక రాజకీయనాయకులు, వేర్పాటువాదులు అందరూ ఉలిక్కిపడ్డారు. 

“ఆర్టికల్ 35ఏ తో ఆడుకోవాలని చూస్తే అది నిప్పుతో చెలగాటమని, దానిని రద్దు చేస్తే కశ్మీర్‌ అల్లకల్లోలం అయిపోతుందని, భారత్ నుంచి కశ్మీర్‌ విడిపోయినా ఆశ్చర్యం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కేంద్రాన్ని హెచ్చరించారు. స్థానిక రాజకీయ నాయకుల వైఖరికి ఆమె మాటలు అద్దం పడుతున్నాయి. వెన్నెముకలేని ఇటువంటి నాయకుల వైఖరి కారణంగానే నేడు కశ్మీర్‌ ఓ అగ్నిగుండంగా మారిందంటే అతిశయోక్తి కాదు. 

ఈ ఏడు దశాబ్ధాలలో జమ్ముకశ్మీర్‌ను భారత్‌ ప్రధాన స్రవంతిలో కలిపేందుకు వారు కృషి చేసి ఉండి ఉంటే, కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి అందుతున్న లక్షల కోట్లు నిధులు, సహాయసహకారాలతో, ఈ ప్రత్యేకాధికారాలు, హక్కులతో ఆ రాష్ట్రం నేడు అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడుతుండేది. కానీ స్థానిక నేతలకు దూరదృష్టి లేకపోవడం, స్వార్ధ రాజకీయాలే పరమావధిగా భావించడంతో వారు కశ్మీర్‌ ప్రజలను పాకిస్థాన్‌కు చేరువచేశారు. 

భారత్ కంటే కొన్ని గంటల ముందు స్వాతంత్రం వచ్చినప్పటికీ పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, అవినీతి, ఉగ్రవాదం, అరాచకత్వం వంటి సకల అవక్షణాలకు పాకిస్థాన్‌ నిలయంగా మారింది. అటువంటి దేశంతో కశ్మీర్ ప్రజలు అంటకాగుతుండటం వలననే నేడు కాశ్మీర్ కూడా అదే స్థితిలోకి వెళ్లిపోయింది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందంటే ఇదేనేమో?

ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ముందుగా కశ్మీర్‌కు భారత్‌కు మద్య అడ్డుగోడగా ఉన్న ఆర్టికల్ 35-ఏని రద్దు చేసి దానితో కశ్మీర్‌కు సంక్రమించిన ప్రత్యేకాధికారాలను, హక్కులను, నియమనిబందనలను అన్నిటినీ తొలగించడం. అదే సమయంలో వేర్పాటువాదులను, ఉగ్రవాదులను నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేయాలి. వారితోపాటు వేర్పాటువాదగీతం ఆలపిస్తూ పాకిస్థాన్‌ కనుసన్నలలో పనిచేస్తున్న కాశ్మీర్ రాజకీయ నాయకులను కూడా పూర్తిగా నియంత్రించవలసి ఉంది. అప్పుడే కాశ్మీర్ మళ్ళీ చల్లబడుతుంది. 

అయితే ఇవన్నీ చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, ఎన్ని విమర్శలు, సవాళ్ళు ఎదురైనా సరే వాటిని అంతే సమర్ధంగా అమలుచేసి చూపించగల సమర్ధులు మన ప్రధాని నరేంద్రమోడీ. కనుక ఈ క్లిష్ట సమయంలో దేశప్రజలు అందరూ ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ చల్లటిమంచులో సెగలుగ్రక్కుతున్న అగ్నిజ్వాలలను ఆర్పగలము.


Related Post