కాశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేదా?

February 18, 2019


img

జమ్ముకశ్మీర్‌లో నిత్యం ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఒకరో ఇద్దరో జవాన్లు, పోలీసులు, పౌరులు చనిపోతూనే ఉంటారు. కానీ వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఉగ్రదాడిలో ఎక్కువమంది చనిపోయినప్పుడే, ప్రభుత్వం, ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందిస్తుంటారు. అయితే మళ్ళీ కొన్ని రోజులకే అందరూ ఆ సంఘటనను మరిచిపోతుంటారు. 

ఉదాహరణకు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై, యూరీలో ఆర్మీ క్యాంప్ పై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు యావత్ దేశమూ ఈవిదంగానే ఆవేశంతో ఊగిపోయింది. ప్రజల ఆవేశం చల్లార్చడానికన్నట్లు కేంద్రప్రభుత్వం కూడా కొన్ని రోజులు హడావుడి చేసింది. పుల్వామా దాడిపై దేశంలో వేడి చల్లారేవరకు కేంద్రప్రభుత్వం కూడా రోజూ ఏదో ఓ పేరుతో హడావుడి చేస్తూనే ఉంటుంది. దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్‌కు ‘అత్యంత ప్రాధాన్యత దేశం’ హోదాను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం మరునాడు పాకిస్థాన్‌ నుంచి భారత్ కు దిగుమతి అవుతున్న అన్నితిపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విదించింది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటువాదులకు భద్రత, కల్పిస్తున్న ఫోన్, వాహన సదుపాయాలన్నిటినీ కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వానికి ఉగ్రవాదులను ఎప్పుడు ఏవిదంగా మట్టుపెట్టాలో ఆర్మీయే నిర్ణయిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. బహుశః మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేయిస్తారేమో? అక్కడితో ఈ కధ సమాప్తం అయినట్లే. 

భారత్ యొక్క ఆ నిర్లిప్తత లేదా ఆసహాయత కారణంగానే జైష్-ఏ మహమ్మద్ ఉగ్రవాదసంస్థ అధినేత మసూద్ అజహర్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లో నేటికీ యాదేచ్చగా తిరుగగలుగుతున్నారని చెప్పక తప్పదు. 

ఈ నేపధ్యంలో దశాబ్ధాలుగా జమ్ముకశ్మీర్‌లో చెలరేగుతున్న హింస, వేర్పాటువాదం , పాక్ ప్రేరిత ఉగ్రదాడులకు ఎప్పటికైనా ముగింపు ఉంటుందా? ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కారం లభిస్తుందా? అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. వాటికి కేంద్రప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. అందుకు ప్రభుత్వాన్ని కూడా నిందించలేము. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేనట్లే, పాక్ తీరులో మార్పు రానంతవరకు భారత్ ఒక్కటే ఈ సమస్యను పరిష్కరించడం అసంభవమే. ముఖ్యంగా కాశ్మీరు ప్రజలు వేర్పాటువాదానికి , పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతున్నంత కాలం ఈ సమస్య క్యాన్సర్ వ్యాదిలా భారత్ ను బాధపెడుతూనే ఉంటుంది. కనుక కేంద్రప్రభుత్వం కాశ్మీర్ సమస్యపై మేధావులు, విదేశాంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు తదితరులతో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తే మంచిది. 


Related Post