తాత్కాలిక బడ్జెట్‌పై విమర్శలేల?

February 02, 2019


img

కేంద్రప్రభుత్వం నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేవిధంగా పలు రాయితీలు, సంక్షేమ పధకాలు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రజాకర్షక బడ్జెట్‌ను రూపొందించారని, కానీ అది కూడా సక్రమంగా లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలురాష్ట్రాలు తమకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని రాయితీలు, పధకాలు లోక్‌సభ ఎన్నికల తరువాత అమలుచేస్తామని చెప్పడాన్ని మోసపూరితచర్యగా కాంగ్రెస్‌ వాదిస్తోంది. నోట్లరద్దుతో కుంటుపడిన దేశ ఆర్ధికాభివృద్ధి, బడ్జెట్‌లో సంక్షేమపధకాలకు భారీగా కేటాయింపులతో మరింత బలహీనపడుతుందని బిజెపిని వ్యతిరేకించే ఆర్ధికనిపుణుల వాదన. 

దేశంలో అన్నివర్గాల ప్రజలను సమానగౌరవం కల్పిస్తూ “సబ్ కే సాత్...సబ్ కా వికాస్” అనేవిధంగా రూపొందించబడిన తాత్కాలిక బడ్జెట్‌ను అద్భుతంగా ఉందని బిజెపి నేతలు, దాని అనుకూలవర్గాలవారి వాదన.

గడిచిన నాలుగున్నరేళ్ళలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో దేశాభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది తప్ప ప్రజాకర్షక పధకాలకు ప్రాధాన్యం ఈయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కనుక ప్రజాకర్షక బడ్జెట్‌ను రూపొందించింది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లయితే ప్రజలను ఆకట్టుకొనేందుకు ఇటువంటి ప్రయత్నాలే చేస్తుందనేది అందరికీ తెలుసు. ఒకవేళ ఆ అవకాశం లేనట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను గుప్పించి ఆ లోటును పూరించుకొంటాయి. మోడీ సర్కార్ కూడా అదేపని చేసింది కనుక దానిని తప్పు పట్టడానికిలేదు. ఈ బడ్జెట్‌ను విమర్శిస్తున్నవారందరికీ ఇది రాబోయే నాలుగు నెలలకు ఉద్దేశ్యించిన తాత్కాలిక బడ్జెట్ మాత్రమేనని తెలిసి ఉన్నప్పటికీ, తమతమ పార్టీల రాజకీయప్రయోజనాల కోసం కేంద్రాన్ని విమర్శిస్తున్నారని చెప్పవచ్చు. 

“సంక్షేమపధకాలను, రాయితీలను ఆశిస్తున్నవారు అవి ఒక జేబులో నుంచి తీసి మరో జేబులో పెట్టుకోవడమేనని గ్రహించాలని, కనుక వాటిని నిరుపేదలైన ప్రజలకు మాత్రమే పరిమితం చేస్తే మంచిదని” ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పిన మాటలో అర్ధం గ్రహిస్తే మంచిది. ప్రజలను ఆకట్టుకోవడం కోసం రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు పోటీలు పడి పధకాలు, రాయితీలు ప్రకటిస్తే, వాటికి అవసరమైన నిధుల కోసం అవి మళ్ళీ ప్రజల దగ్గర నుంచే పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తాయని రఘురామ రాజన్ మాటల సారాంశం. కనుక ప్రభుత్వాలు పేదలకు కాకుండా సమాజంలో ఇతర వర్గాలకు ఎన్ని రాయితీలు, పధకాలు ప్రకటిస్తే, అంతభారం మళ్ళీ ఆ ప్రజలే భరించాల్సి ఉంటుందని గ్రహిస్తే వాటిని ఎవరూ కోరుకోరు. 

సమాజంలో అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి రాయితీలు, సంక్షేమ పధకాల అమలుచేయడం చాలా అవసరమే కానీ ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవడం కోసం ప్రకటించేవే దేశ ఆర్ధిక వ్యవస్థకు గుదిబండలుగా మారుతాయి.


Related Post