ఎన్నికల బడ్జెట్‌లో వరాల జల్లు

February 01, 2019


img

ఈరోజు తాత్కాలిక ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఊహించినట్లుగానే దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేవిధంగా రూపొందించబడింది. పేరుకు తాత్కాలిక బడ్జెటే అయినా పూర్తిస్థాయి బడ్జెట్‌కు తీసిపోనివిధంగా రూపొందించబడిన దానిలో కేంద్రప్రభుత్వం అనేక వరాలు కురిపించింది. ఆ వివరాలు క్లుప్తంగా: 

1. రైతుల కోసం: దేశంలో 5 ఎకరాలు అంతకంటే తక్కువ పొలం ఉన్న రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం కింద ఏడాదికి రూ.6,000 చెల్లిస్తుంది. దీనిని మూడు విడతలలో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తుంది. ఈ పధకం కోసం బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం రూ.75,000 కోట్లు కేటాయించింది. ఈ పధకం వలన దేశంలో మొత్తం 12 కోట్లు మంది రైతులు లబ్ధి పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు.

2. ప్రకృతి విపత్తులకు లోనైనా ప్రాంతాలలో రైతుల రుణాలపై 2శాతం వడ్డీపై రాయితీ, సకాలంలో చెల్లించిన వారికి మరో 3 శాతం వడ్డీపై రాయితీ.  

3. పాడి, మత్స్య పరిశ్రమలకు చెందిన రైతుల కిసాన్ క్రెడి కార్డు రుణాలపై 2 శాతం వడ్డీలో రాయితీ. దీనికోసం  రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కింద రూ.750  కోట్ల నిధులు కేటాయింపు.

4. మధ్యతరగతి ప్రజల కోసం: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. పీఎఫ్, పొదుపు పధకాలలో పెట్టుబడులు పెడుతున్నవారికి, అదేవిధంగా రూ. 2 లక్షల వరకు గృహరుణాలు, ఆరోగ్యభీమా వంటి చెల్లింపులు చేస్తున్నవారికి రూ.6.5 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లించనవసరం లేదు. ఆదాయపన్ను పరిమితిని పెంచడం ద్వారా సుమారు 3 కోట్ల మంది లబ్ధి పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. 

5. పోస్టాఫీస్‌ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్‌ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

6. రెండు ఇళ్లకు అద్దె చెల్లిస్తున్నవారికి రెండవ ఇంటి అద్దెకు కూడా ఆదాయపన్నులో మినహాయింపు కోరవచ్చు. 

7. ఇంటి అద్దెలపై టీడీఎస్‌ రూ.1.80 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంపు.

8. ఇప్పటి వరకు ఒకే ఇంటిపై పెట్టిన పెట్టుబడికి ఆదాయపన్ను మినిహాయింపు లభించేది. ఇక నుంచి రెండు ఇళ్లకు ఇది వర్తింపజేసి క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఇది వర్తిస్తుంది. 

9. 2020లోపుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా పేదల ఇళ్లకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. 

10. కార్మికుల కోసం: అసంఘటిత రంగంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ప్రధాన మంత్రి శ్రమ్‌ యోజన కింద నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. దీనికోసం కార్మికులు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 

11. గ్రాట్యూటీ పరిధి రూ.30 లక్షలకు పెంపు. 

12. చిన్న వ్యాపారుల కోసం: ఏడాదికి రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు ఇకపై 3 నెలలకు ఒకసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయవచ్చు.

13. రక్షణశాఖ ఉద్యోగుల కోసం: రక్షణశాఖకు రూ.3 లక్షల కోట్లు కేటాయింపులు. 

14. సైనిక దళాల వేతనాలు భారీగా పెంపు. వన్ ర్యాన్ వన్ పింఛన్ పధకం అమలుకు రూ.35 వేల కోట్లు నిధులు కేటాయింపు. 

15. ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం: ప్రస్తుతం ఉన్న రూ. 62,574 కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధిని రూ. 76,800 కోట్లకు పెంపు.  

16. సినీ పరిశ్రమ: సినీ నిర్మాణ సంస్థలకు ఇక నుంచి సింగిల్ విండో క్లియరెన్స్. పైరసీని అరికట్టడం కోసం సినిమాటోగ్రఫీ చట్టం రూపకల్పన.  

17. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి గత ఏడాది కంటే 21 శాతం అధనంగా రూ. 58,166 కోట్లు కేటాయింపు.


Related Post