సిరిసిల్లాలోనే ఈ పరిస్థితులుంటే....

January 18, 2019


img

రాష్ట్రంలో టెక్స్ టైల్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళలో అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో దీనికి అవసరమైన ముడిసరుకు, మంచి నైపుణ్యం కలిగిన పనివారు ఉన్నందున ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించవచ్చుననే ఆలోచనతో వరంగల్ సమీపంలో కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు జోరుగా సన్నాహాలు చేస్తోంది. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తమిళనాడుకు చెందిన కొన్ని సంస్థలు సంసిద్దత వ్యక్తం చేశాయి. ఇది ఏర్పాటయితే రాష్ట్రంలో వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే నేత పరిశ్రమ అనగానే మొట్టమొదట గుర్తుకువచ్చే సిరిసిల్లాలో గల టెక్స్ టైల్ పార్కులో గల పరిశ్రమలు గత 11 రోజులుగా మూతపడున్నాయి. వాటిలో పనిచేస్తున్న కార్మికులు జీతాలు పెంచాలని తమ యాజమాన్యాలను కోరగా వారు అందుకు నిరాకరించడంతో గత 11 రోజులుగా కార్మికులు అందరూ సమ్మె చేస్తుండటంతో 103 పరిశ్రమలు మూతపడ్డాయి. 

విశేషమేమిటంటే, ఇటు కార్మికుల, అటు యాజమాన్యాల వాదనలు సహేతుకమైనవే కావడం. ప్రతీ రెండేళ్ళకోసారి జీతాలు పెంచాలనే ఒప్పందం 2018, జూన్ 28తో ముగిసింది. కనుక కార్మిక చట్టాల ప్రకారం తమకు కనీసవేతనం పెంచాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుతం రోజుకు 12 గంటలు చొప్పున 26 రోజులు పనిచేస్తే కేవలం రూ.12,000 మాత్రమే లభిస్తోందని, దానితో కుటుంబపోషణ కష్టమవుతోందని కార్మికులు మొరపెట్టుకొంటున్నారు. అలాగే రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తున్నందున శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఆరోగ్యసమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని అయినా కుటుంబ పోషణ కోసం పనిచేయకతప్పడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక టెక్స్ టైల్ సంస్థల యాజమానుల వాదన మరోలా ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో విపరీతమైన పోటీ నెలకొని ఉన్నందున తయారుచేసిన వస్త్రాలు అమ్ముకోవడమే చాలా కష్టంగా ఉందని, ఒక్కోసారి నష్టానికి అమ్ముకోవలసి వస్తోందని చెపుతున్నారు. మహరాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో టెక్స్ టైల్ పరిశ్రమలకు ఒక యూనిట్ కు విద్యుత్ ఛార్జీ రూ.2.50 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనిట్ కు రూ.8.75 ఉందని, ఇది కూడా తమకు పెనుభారంగా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అనేక సమస్యలున్నాయని కనుక ప్రస్తుత పరిస్థితులలో నెలకు రూ.12,000కు మించి జీతాలు ఇవ్వలేమని ఇస్తే పరిశ్రమలు మూసుకోవలసి వస్తుందని వాదిస్తున్నారు. 

సిరిసిల్లా టెక్స్ టైల్ పరిశ్రమలో నెలకొన్న ఈ సమస్య వాస్తవ పరిస్థితులకు అద్ధం పడుతోంది. కనుక దీనిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలి. అదేవిధంగా, ఎంత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పటికీ ఇటువంటి సమస్యలుంటాయని ఇది స్పష్టం చేస్తోంది కనుక వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ముందే చేసుకోవడం మంచిది. 


Related Post