మమతక్కను ఎవరు ప్రసన్నం చేసుకొంటారో?

January 18, 2019


img

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో శనివారం ‘యునైటెడ్ ఇండియా’ పేరుతో కోల్‌కతాలో భారీ ర్యాలీ జరుగబోతోంది. వివిద రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయపార్టీ నేతలు దీనికి హాజరవబోతున్నారు. ఈ ర్యాలీకి ఆమె ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపారు. ఆమె నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి బిజెపియేతర పార్టీలను మాత్రమే ఆహ్వానించారు. కనుక కాంగ్రెస్‌, మిత్రపక్షాలన్నీ ఈర్యాలీకి హాజరవుతాయి. చంద్రబాబునాయుడు కూడా అదే కోరుకొంటున్నారు కనుక ఆయన కూడా ర్యాలీలో పాల్గొనబోతున్నారు. 

సిఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయమని చెపుతున్నందున, కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యే ఈ ర్యాలీకి తెరాస హాజరుకాకపోవచ్చు. సిఎం కేసీఆర్‌ లేదా తెరాస ప్రతినిధులు దానిలో పాల్గొనడానికి వెళుతున్నట్లు ఇంతవరకు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కనుక ఈ ర్యాలీకి తెరాస దూరంగా ఉంటుందని భావించవచ్చు.

మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే రాష్ట్రంలో బిజెపి నుంచి కూడా గట్టి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. కనుక ఆమె బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదీగాక ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలనే కోరిక కూడా ఆమెకు ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బిజెపిలకు, దేశంలో ప్రాంతీయ పార్టీలకు  తన శక్తిసామర్ధ్యాలను చాటి చెప్పేందుకే ఆమె ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారని భావించవచ్చు. 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్దపడితే ఆమె తప్పకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమిలో చేరవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించకపోతే, లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ బిజెపికి, నరేంద్రమోడీకి దూరంగా ఉంటారనే నమ్మకం కలిగించగలిగితే ఆమె ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడానికి అంగీకరించవచ్చు. కానీ అప్పుడూ తనను ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనే షరతు విధించవచ్చు. కనుక మమతక్కను కేసీఆర్‌, చంద్రబాబునాయుడులో చివరికి ఎవరు ప్రసన్నం చేసుకొంటారో, ఆమె ఎటువైపు మొగ్గుతారో ఊహించడం కష్టమే.


Related Post