కేసీఆర్‌-చంద్రబాబు యుద్ధంలో జగన్ పరిస్థితి?

January 17, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏపీ సిఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవడంతో, తెలంగాణ సిఎం కేసీఆర్‌ తాను కూడా ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకొంటానని స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాక అప్పుడే ఆ పని మొదలుపెట్టేశారు కూడా. 

సంక్రాంతి పండుగ సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలు తలసాని, మాధవరంలను విజయవాడ, భీమవరం పంపించి బాబుకు మొదటి షాక్ ఇప్పించారు. వెనువెంటనే కేటీఆర్‌ను జగన్ వద్దకు పంపించి మరో పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్‌ అమరావతిలో పర్యటనకు వస్తారని, అక్కడే రాజకీయాలకు శ్రీకారం చూడతారని తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాను కూడా త్వరలోనే ఏపీలో అన్ని జిల్లాలోను పర్యటిస్తానని తలసాని చెప్పారు. 

చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి, ప్రచారార్భాటమే తప్ప అభివృద్ధి జరుగలేదని తలసాని అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు చెపుతున్నావన్నీ అబద్దాలే అని తలసాని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

తెరాస నేతలు ఈవిధంగా పదేపదే చంద్రబాబును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండటం కూడా కేసీఆర్‌ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. తద్వారా సార్వత్రిక ఎన్నికలకు ముందే బాబు, టిడిపి మంత్రుల మనోధైర్యాన్ని దెబ్బ తీయాలని కేసీఆర్‌ ఆలోచన కావచ్చు. అయితే చంద్రబాబు కేసీఆర్‌ గాలానికి చిక్కుతారనుకోలేము. ఎందుకంటే ఆయనతో సహా టిడిపి నేతలు అందరూ అప్పుడే తెరాస-జగన్ దోస్తీని తమ పార్టీకి ఎన్నికల ఆయుధంగా మలుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కనుక కేసీఆర్‌-చంద్రబాబు మద్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్దంలో జగన్ రాజకీయ లబ్ధి పొందుతారా లేక పావుగా మిగిలిపోతారో చూడాలి.       



Related Post