ఆచరించి అడిగితే బాగుండేది కదా?

December 19, 2018


img

తెరాస ఎంపీలు ఈరోజు కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కలిసి చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలలో ఒకే విధానం అమలుచేయాలని తమ పార్టీ కోరుకొంటోందని తెలిపారు.

 మైనార్టీల రిజర్వేషన్లు విషయంలో కూడా తెరాస ఇదేవిధంగా వ్యవహరించి అసెంబ్లీ ఎన్నికలలో వారిని ఆకట్టుకొని రాజకీయ లబ్ధిపొందడం అందరూ చూశారు. కనుక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస తన పరిధిలో లేని అంశమైన చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నట్లు భావించవచ్చు. 

ఒకవేళ తెరాసకు నిజంగానే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రాజ్యాధికారంలో భాగం కల్పించాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలలోనే దానిని ఆచరించి చూపవచ్చు. కానీ ఒక్క బిఎల్ఎఫ్ తప్ప తెరాసతో సహా అన్ని పార్టీలు అగ్రకులాల అభ్యర్ధులకే ఎక్కువ సీట్లు కేటాయించాయి. 

కేవలం రాజకీయ పార్టీలే కాదు...వివిద కులసంఘాల నేతలలో కూడా తమ వర్గానికి న్యాయం చేయాలనే తపన, పట్టుదల కనిపించకపోవడం శోచనీయం. బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, ఎం.ఆర్.పి.ఎస్.అధినేత మందకృష్ణ మాదిగ,  బడుగుబలహీనవర్గాల కోసం పోరాడుతున్నానని చెప్పుకొనే గద్దర్ వంటి నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికలలో తమ వర్గానికి పెద్దపీట వేసిన బిఎల్ఎఫ్ ను కాదని ప్రజాకూటమికి వంతపాడారు. అంటే కులసంఘాల నేతలతో సహా అన్ని రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నాయి కనుకనే ఈవిధంగా రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయని చెప్పక తప్పదు.


Related Post