అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పు... రేపు?

December 18, 2018


img

పదేళ్ళ కాంగ్రెస్‌ (యూపీయే) హయాంలో ఎన్ని కుంభకోణాలు వెలుగుచూశాయో...దేశ ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో... వ్యవస్థలన్నీ ఎంత అస్తవ్యస్తం అయ్యాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలన అవినీతి, అసమర్ధత, అలసత్వానికి ప్రతీకగా సాగడంతో 2014 ఎన్నికలలో దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించి భారత ఆశాకిరణంలా ఆవిర్భవించిన నరేంద్రమోడీకి అధికారం కట్టబెట్టారు. 

కానీ ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బిజెపిని గద్దె దించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అంటే ఆనాడు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన తప్పులన్నిటినీ ప్రజలు మరిచిపోయారనుకోవాలా...క్షమించేశారనుకోవాలా?అంటే కాదనే చెప్పుకోక తప్పదు. సాధారణంగా కొంతకాలం తరువాత ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. 

అయితే మోడీ హయాంలో అవినీతి జరుగలేదు కదా? దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా? అని ప్రశ్నించుకొంటే, నిజమే కానీ విజయ్ మాల్యా వంటి ఆర్ధికనేరగాళ్ళు వేలకోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలు పారిపోతుంటే వారిని కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడంతో వారికి అప్పిచ్చి నిండా మునిగిన బ్యాంకులు వాటిని మొండి బకాయిలుగా వ్రాసుకొని ఆ భారాన్ని సామాన్య ప్రజలపైకి బదిలీ చేయడం ప్రజల ఆగ్రహానికి ఒక కారణమని చెప్పవచ్చు. 

ఇక నోట్లరద్దు, జిఎస్టి వంటి నిర్ణయాలతో దేశానికి కొంత మేలు జరిగినప్పటికీ, దేశంలో అన్ని వర్గాల ప్రజలపై అవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక రఫేల్ యుద్దవిమానాల కొనుగోలులో నిజానిజాలు కాంగ్రెస్‌, బిజెపిలకే ఎరుక. కానీ కాంగ్రెస్‌ పార్టీ పనిగట్టుకొని దాని గురించి చేసిన ఆరోపణలు దేశప్రజలలో మోడీ ప్రభుత్వంపై అనుమానాలు రేకెత్తించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, అసమర్దత కామన్ అనుకొంటే, బిజెపి పాలనలో మతతత్వం కామన్ అనుకోవలసి ఉంటుంది.    

ఇటువంటి అనేక కారణాల చేతనే బిజెపి మూడు రాష్ట్రాలను చేజార్చుకొందని చెప్పక తప్పదు. కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏవిధంగా వ్యతిరేకించారో ఇప్పుడు బిజెపిని కూడా అదేవిధంగా వ్యతిరేకిస్తున్నారని భావించవచ్చు. ఈ లెక్కన 2019 ఎన్నికలలో బిజెపి ఎదురీదక తప్పదేమో?


Related Post