ఓవైసీల కలలు చెదిరాయా?

December 08, 2018


img

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, “తెరాస-మజ్లీస్ కూటమి ఘనవిజయం సాధించబోతోందని స్పష్టమయింది. మేము మద్దతు ఇస్తున్న తెరాస మళ్ళీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది,” అని అన్నారు.

ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ఓవైసీ సోదరులు రాష్ట్రంలో ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడుతుందని, అప్పుడు తామే ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలో నిర్ణయిస్తామని, ఎవరు అధికారంలో ఉన్నా తమ ముందు చేతులు కట్టుకొని నిలబడవలసిందేనని పాతబస్తీ ప్రజలకు చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చెపుతున్న మాటలు విన్నప్పుడు తమవి పగటి కలలేనని వారు అంగీకరించినట్లు స్పష్టం అవుతోంది. అందుకే తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పుకొన్నారు. కానీ ‘మా మిత్రపక్షం తెరాస’ అనే బదులు ‘మేము మద్దతు ఇస్తున్న తెరాస’ అంటే దానార్ధం మజ్లీస్ మద్దతుతో తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కాదు. తమ పార్టీని చులకన చేసుకోవడం ఇష్టం లేకనేనని చెప్పవచ్చు. అదేవిధంగా 'మజ్లీస్-తెరాస కూటమి' అని చెప్పుకోవడం కూడా అందుకే. నిజానికి ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలే తప్ప కూటమిగా ఏర్పడలేదని అందరికీ తెలుసు.     

ఇప్పుడు మళ్ళీ కేసీఆర్‌తోనే అవసరం పడుతుంది కనుక అప్పుడే ఓవైసీ స్వరంలో మార్పు వచ్చి కేసీఆర్‌ భజన ప్రారంభించేశారు. కానీ పరిస్థితులు మారితే తాము ఏవిధంగా వ్యవహరించబోతున్నామో చెప్పుకొని  ఓవైసీలు తమ నిజస్వరూపం బయటపెట్టుకొన్నారు. కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో ఓవైసీలు తెరాసకు నష్టం కలిగించేవిధంగా మాట్లాడినప్పటికీ కేసీఆర్‌ చాలా సంయమనంతో మిత్రధర్మం పాటించారు.


Related Post