నాపై మూకుమ్మడి దాడి జరుగుతోంది: కేసీఆర్‌

November 28, 2018


img

సిఎం కేసీఆర్‌ నిన్న ఆమనగల్లు సభలో ప్రసంగిస్తూ, “ఒక బక్క పలుచని వ్యక్తి కేసీఆర్‌ను కొట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, అమిత్ షా కలిసికట్టుగా వస్తున్నారు. అందరూ కలిసి నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి నన్ను ఒక ‘రాజకీయ ఫజిల్’ గా మార్చేశాయి. కానీ నేను ఏ పార్టీతో రహస్యంగా పొత్తులు పెట్టుకోలేదు. మజ్లీస్ పార్టీ ఒక్కటే మాకు మిత్రపక్షమని నేను బహిరంగంగా చెపుతున్నాను. మీరు నా మాట నమ్మండి. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మీరందరూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

నిన్నటి వరకు తనకు తిరుగెలేదన్నట్లు మాట్లాడినా సిఎం కేసీఆర్‌ ఇంత బేలగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు వచ్చి జోరుగా ఎన్నికల ప్రచారం చేయడం సర్వసాధారణం. ఆ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అధికారపార్టీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం కూడా సర్వసాధారణమైన విషయమే. కానీ ప్రతిపక్షపార్టీల ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ తనపై జరుగుతున్న మూకుమ్మడి దాడిగా అభివర్ణించడం విడ్డూరంగా ఉంది. 

గత రెండున్నర నెలలుగా ఆయనతో సహా తెరాస మంత్రులు, ఎంపీలు, నేతలు, పార్టీ అభ్యర్ధులు అందరూ మూకుమ్మడిగా ప్రజాకూటమిని, చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని తీవ్రవిమర్శలు, చాలా అనుచితమైన బాషలో తిట్లు తిట్టిన్నప్పుడు తప్పుగా అనిపించనప్పుడు, ఇప్పుడు మోడీ, రాహుల్, బాబు వచ్చి తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు ఎలా అవుతుంది? వారి ప్రశ్నలకు, ఆరోపణలకు కేసీఆర్‌ ధీటుగా జవాబు చెప్పాలి తప్ప తనపై వారు దాడి చేస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టడం, తప్పుదారి పట్టించడం కేసీఆర్‌కు తగునా? 

నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళిన్నట్లయితే తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బాగా హైలైట్ చేసుకొని ప్రజలను ప్రసన్నం చేసుకొని సులువుగా ఎన్నికలలో గెలవవచ్చని కేసీఆర్‌ భావించారు. కానీ గత రెండున్నర నెలలలో ఆ ప్రచారం కంటే ప్రజాకూటమిని, చంద్రబాబు నాయుడును బూచిగా చూపిస్తూ దెబ్బ తీయాలని ప్రయత్నించారు. కనుక ప్రజాకూటమిలో పార్టీలు కూడా అదేవిధంగా కేసీఆర్‌కు జవాబు ఇస్తున్నాయి. అదే...తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెరాస గట్టిగా ప్రచారం చేసుకొని, బిజెపి, ప్రజాకూటమిని ఆ ముగ్గులోకి లాగి ఉండి ఉంటే, తెరాసకు జవాబు చెప్పుకోలేక బిజెపి, ప్రజాకూటమి విలవిలలాడేవి. నేడు కేసీఆర్‌ ఇంత బేలగా మాట్లాడవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ తెరాస స్వయంకృతాపరాధం చేత ప్రతిపక్షపార్టీలకు తెరాసను ఈవిధంగా ‘కార్నర్’ చేసే అవకాశం లభించిందని చెప్పవచ్చు.


Related Post