ప్రజాకూటమి అజెండా విడుదల

November 26, 2018


img

మహాకూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే అప్పుడు ఆ ప్రభుత్వం ఏవిధంగా ముందుకు సాగాలి? దాని ప్రాధాన్యతలు ఏమిటి? అనే అంశాలతో కూటమిలో నాలుగు పార్టీలు ఒక ‘కామన్ మినిమమ్ అజెండా’ ను రూపొందించుకొన్నాయి. దానిని మహాకూటమి నేతలు సోమవారం మీడియాకు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇక నుంచి మా మహాకూటమిని ప్రజాకూటమిగా సంభోదించాలని మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్‌ ఫాం హౌసుకు, కేటిఆర్‌ అమెరికా వెళ్ళిపోయేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పేశారు కనుక డిసెంబరు 12వ తేదీన రాష్ట్రంలో మా ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ప్రొఫెసర్ కోదండరామ్‌ నేతృత్వంలో పనిచేసే కామన్ మినిమమ్ అజెండా అమలు కమిటీలో నాలుగు పార్టీల నేతలు సభ్యులుగా ఉంటారు. దాని మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం ఆ అజెండాను అమలుచేస్తుంది,” అని చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్‌ మీడియాకు దాని గురించి వివరించారు. ప్రజా కూటమి కామన్ మినిమమ్ అజెండాలో ముఖ్యాంశాలు: 

1. ప్రభుత్వంలో నిరంకుశ విధానాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యబద్దంగా చట్టాలకులోబడి, ప్రజలకు జవాబుదారిగా ఉండేవిదంగా పారదర్శకమైన పాలనసాగిస్తాము. 

2. ధర్నా చౌక్ పై విధించిన నిషేధం ఎత్తివేస్తాం. 

3. మొదటి సం.లోనే లక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీ చేస్తాం. 

4. ప్రాజెక్టులలో అవినీతిపై దర్యాప్తు జరిపిస్తాం. 

5. ఒకేసారి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తాం. 

6. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. 

7. ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, నేతన్నలకు నెలకు రూ.2,000 పెన్షన్ చెల్లిస్తాం.

8. వికలాంగులకు నెలకు రూ.3,000 పెన్షన్ చెల్లిస్తాం.

9. అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లతో సహా అన్ని ప్రభుత్వ పధకాలను వర్తింపజేస్తాము. 

10. తొలితరం ఉద్యమకారులకు కూడా పెన్షన్ చెల్లించడానికి గల అవకాశాలను పరిశీలిస్తాం 

11. మొదటి ఏడాదిలోనే అమరవీరులకు స్తూపం నిర్మిస్తాం.

12. ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేస్తాం. 

13. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర బడుగు బలహీనవర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేవిధంగా విధానాలు రూపొందిస్తాం. 

14. నిరుపేదలైన అగ్రవర్ణాల సంక్షేమం కోసం ఒక కమీషన్ ఏర్పాటు చేస్తాం.

15. కౌలు రైతులు, సన్నకారు రైతులకు కూడా రైతుబంధు, రైతు భీమా పధకాలను వర్తింపజేస్తాం.

16. ప్రభుత్వ రంగంలో ప్రాధమిక విద్య నుంచి ఉన్నతవిద్యల వరకు విద్యావ్యవస్థలను బలోపేతం చేస్తాం. 

17. రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఎక్కడికక్కడ ఉద్యోగఉపాది అవకాశాలను పెంచుతాము. 

18. కులవృత్తులు, కుటీర పరిశ్రమలకు పెద్దపీట వేస్తాం.

 ఇవి మా అజెండాలో కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే. త్వరలో పూర్తి అజెండాను విడుదల చేస్తాము, అని కోదండరామ్‌ చెప్పారు.


Related Post