వాళ్ళు మజ్లీస్ కనుసన్నలలో పనిచేయాల్సిందే: అమిత్ షా

November 25, 2018


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం వరంగల్ జిల్లా పరకాలలో ఆ తరువాత నిర్మల్ జిల్లా విశ్వనాధ్ పేటలో బహిరంగసభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించడానికి కేసీఆర్‌కు తీరికలేదు కానీ మజ్లీస్ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలతో బిర్యానీలు తినడానికి మాత్రం సమయం ఉంటుంది. కేసీఆర్‌ మజ్లీస్ పార్టీ కనుసన్నలలో పనిచేస్తున్నారు. అసలు మజ్లీస్ పార్టీని చూసి కేసీఆర్‌ ఎందుకు అంతా భయపడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. బిజిపి ఒక్కటే మజ్లీస్ పార్టీని ఎదిరించగలదు. బిజెపి మాత్రమే వారికి లొంగకుండా ప్రభుత్వం నడిపించగలదు. 

ఒకవేళ  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా కేసీఆర్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చినా అందరూ మజ్లీస్ నేతల కనుసన్నలలోనే పనిచేయక తప్పదు. వారికి భయపడే కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా  జరపడం లేదు. వారిని ప్రసన్నం చేసుకోవడానికే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి దానికోసం శాసనసభలో ఒక తీర్మానం చేసి డిల్లీకి పంపించారు. కానీ మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టాలు, సుప్రీంకోర్టు అంగీకరించవని కేసీఆర్‌కు తెలియదా? చట్టలకు, న్యాయస్థానాలకు తానేమైనా అతీతుడునాని అనుకొంటున్నారా? అయినా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం దళితుల కోటాలో కోత విధిస్తారా లేక బీసీలకు కోత విధిస్తారా? ఒక్క విషయం ప్రజలకు స్పష్టం చేయదలిచాను. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంత వరకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించబోము,” అని అన్నారు. 


Related Post