తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి?

November 23, 2018


img

ఒకవేళ మహాకూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటి సమస్య ముఖ్యమంత్రిని ఎన్నుకోవడమే అవుతుందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలోనే కనీసం 12 మందికి పైగా ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారు కనుకనే మహాకూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ధైర్యంగా ప్రకటించలేకపోయిందని చెప్పవచ్చు.  

ఒకవేళ ఈ ఎన్నికలలో మహాకూటమి గెలి(పి)స్తే ఆ క్రెడిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక సిఎం రేసులో ఆయనే మొదటి స్థానంలో ఉంటారు. ఇక ఈఎన్నికలలో గెలిస్తే నల్గొండ కాంగ్రెస్‌ నేత ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఎప్పుడో ప్రకటించారు. అంటే తానో లేక జానారెడ్డి కానీ సిఎం అవుతారని ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

ఇక జైపాల్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, షబ్బీర్ ఆలీ, దామోదర రాజా నర్సింహా, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వంటి సిఎం అభ్యర్ధులు పార్టీలో అనేకమంది ఉన్నారు. ఒకవేళ సిఎం పదవికి టిజేఎస్, టిడిపి పార్టీలు కూడా పోటీ పడినట్లయితే ఈ సిఎం  జాబితాలో మరో మూడు నాలుగు పేర్లు వ్రాసుకోవలసిఉంటుంది. 

ఈ సమస్య సరిపోదన్నట్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ మహాకూటమి అధికారంలోకి వస్తే ఒక మహిళా నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి కొత్త చర్చకు శ్రీకారం చుట్టారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలులో ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులు? అనే కొత్త చర్చకు తెర తీసి వారిలో వారిమద్య కూడా పోటీకి బీజం వేశారు. మహిళా నేతలలో సబితా ఇంద్రారెడ్డి, డికె.అరుణ, గీతారెడ్డి, రేణుకా చౌదరి వంటి బలమైన నేతలున్నారు. 


Related Post