తెరాస కారు స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది: ఓవైసీ

November 13, 2018


img

మజ్లీస్ పార్టీ మాకు మిత్రపక్షమని సిఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. మజ్లీస్ నేతలు కూడా తెరాస అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే రాజేందర్ నగర్ నియోజకవర్గంలో మాత్రం ‘దోస్తీగీస్తీ జాన్తా నై’ అంటున్నారు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. 

రాజేందర్ నగర్ నుంచి తెరాస అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ అక్కడి నుంచి తమ అభ్యర్ధి మీర్జా రహమత్ బేగ్ పోటీ చేస్తున్నారని కనుక తెరాస కారు రాజేంద్రనగర్ లో తప్ప రాష్ట్రంలో మరెక్కడైనా తిప్పుకోవచ్చని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కారు స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని దానిని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తిరుగనీయమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిన్న రాత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఇమాద్ నగర్ లో మజ్లీస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రజలను, మజ్లీస్ కార్యకర్తలను ఆకట్టుకోవడానికే ఓవైసీ ఆవిధంగా చమత్కారంగా మాట్లాడినట్లు పైకి కనబడవచ్చు. కానీ ఈసారి ఎన్నికలలో తెరాసకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు గెలుచుకోలేకపోతే తమపై ఆధారపడక తప్పదని, అప్పుడు సిఎం పదవి మజ్లీస్ పార్టీకే దక్కినా ఆశ్చర్యం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ రెండు నెలల క్రితం చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకొంటే మజ్లీస్ బుర్రలో అటువంటి అత్యాశ ఉందని అర్ధమవుతోంది. ఆ ఉద్దేశ్యంతోనే కారు స్టీరింగు తమ చేతిలో ఉందని ఓవైసీ అంటున్నారేమో?


Related Post