తెరాస అభ్యర్ధులు యుద్ధానికి సై!

November 12, 2018


img

సిఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం తెలంగాణభవన్‌లో తెరాస అభ్యర్ధులకు స్వయంగా బి-ఫారంలు అందజేశారు. తన బి-ఫారంను తెరాస సెక్రెటరీ జనరల్ కె కేశవరావు నుంచి అందుకొన్నారు. అయితే నాంపల్లి అభ్యర్ధి ఆనంద్ కుమార్ గౌడ్ కు మాత్రం బి-ఫారం ఇవ్వలేదు. ఈరోజు ఉదయం వచ్చి తనను కలవాలని సిఎం కేసీఆర్‌ ఆయనను కోరారు. 

బి-ఫారంలు అందజేసే ముందు సిఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్ధులకు నామినేషన్ల దాఖలు మొదలు ఎన్నికల కోడ్, ప్రచారం వరకు ప్రతీ అంశంపై వివరించి ఎక్కడా పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మహాకూటమిలో నాలుగు పార్టీల నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధుల పేర్లు వారి నియోజకవర్గాల జాబితాను కూడా చదివి వినిపించి, ప్రత్యర్ధుల బలాబలాలను అంచనా వేసుకొని అందుకు తగ్గట్లుగా ఎన్నికల వ్యూహాలు రచించుకొని ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం. 

మహాకూటమిలో టిడిపి (14), టిజేఎస్ (8), సిపిఐ (3) పార్టీలు పోటీ చేయబోయే స్థానాలన్నీ తెరాస ఖాతాలో పడినట్లే భావించవచ్చునని కేసీఆర్‌ చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే వాటిలో 20 స్థానాలలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. గ్రేటర్ పరిధిలో మజ్లీస్ సీట్లు మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలు మళ్ళీ తెరాస గెలుచుకోబోతోందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. మొత్తంగా ఈసారి ఎన్నికలలో తెరాస 100కు పైగా స్థానాలు గెలుచుకొని భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోందని మరోసారి నొక్కి చెప్పారు. 

బి-ఫారంలు కూడా చేతికి అందడంతో తెరాస అభ్యర్ధులు  చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపించారు. ఈరోజు 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈరోజు మొదటి కార్తీక సోమవారం కనుక నేడే అనేకమంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. తెరాస అభ్యర్ధులు నామినేషన్లు వేయడానికి సిద్దం అవుతుంటే మహాకూటమిలో ఇంకా సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతూనే ఉండటం విశేషం.


Related Post