జనసమీకరణ సభల పరమార్ధం ఏమిటో?

October 05, 2018


img

ఒకప్పుడు అంటే సుమారు 30 ఏళ్ళ క్రితం రాజకీయ పార్టీలు బహిరంగసభలు నిర్వహించదలచినప్పుడు వాటి గురించి ముందుగా ప్రచారం చేసుకొని తమ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరేవారు. ఆ పార్టీ పట్ల లేదా సదరు నాయకుడి పట్ల అభిమానం ఉన్నవారు స్వచ్ఛందంగా వారి సభలకు తరలివచ్చేవారు. ఇది గతం. 

ఇప్పుడు అన్ని పార్టీలు జనసమీకరణ చేసి సభలకు జనాలను తెచ్చుకొంటున్నాయి. దానిని ఎవరూ తప్పుగా భావించడం లేదు కనుక ఆ విషయం చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరూ సిగ్గుపడటం లేదు కూడా. పైగా ఒక్కో నియోజకవర్గం లేదా జిల్లా నుంచి ఎవరు ఎంతమందిని సమీకరించి సభకు తరలించాలనే విషయాన్ని బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. ఆవిధంగా ఎంత ఎక్కువ మంది జనాలను తెచ్చుకొంటే ఆ సభ అంత విజయవంతం అయినట్లు పరిగణించడం అందరికీ అలవాటయిపోయింది. 

ప్రజలు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీల సభలకు రావడం ఎప్పుడో మానుకొన్నారు కనుక వారికి సకల సౌకర్యాలు కల్పించి ఇంకా ఏవో ఆశ చూపించి సభలకు తెచ్చుకొని తమ సభ విజయవంతం అయ్యిందని జబ్బలు చరుచుకోవడం నేడు పరిపాటిగా మారిపోయింది. 

ఒకవేళ ప్రత్యర్ధి నేత లేదా పార్టీ డబ్బు ఖర్చు పెట్టలేకనో లేక చేతిలో అధికారం లేకపోవడం వలననో భారీగా జనసమీకరణ చేసుకోలేకపోతే, ఆ పార్టీకి లేదా సదరు రాజకీయ నాయకుడికి ప్రజాధారణలేదని నిర్ధారించేయడం పరిపాటిగా మారింది. అయితే జనసమీకరణ ద్వారా సభకు వచ్చినవారందరూ సదరు నాయకుడికి లేదా పార్టీకే ఖచ్చితంగా ఓటేస్తారా? అంటే అనుమానమే. మరి అటువంటప్పుడు భారీగా డబ్బు ఖర్చుపెట్టి జనసమీకరణ చేసుకొని తమ సభ విజయవంతం అయ్యిందని ఆత్మవంచన చేసుకోవడం దేనికో తెలియదు. 

దాని కంటే సదరు నేతలే జనం ఉన్న ప్రాంతాలకు వెళ్ళి రోడ్ షోలు నిర్వహించి తాము చెప్పదలచుకొన్నదేదో చెపితే మంచిదేమో కదా? 


Related Post