ఆ ఆదర్శ కుటుంబంలో నాకు చోటు లేదు: పూజిత

November 26, 2026


img

విక్టరీ వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' (AK47) సినిమా చుట్టూ కొత్త వివాదం మొదలైంది. 

ఈ సినిమాలో నటించిన పూజిత పొన్నాడ తన పాత్ర విషయంలో చిత్రబృందం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాలో తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తామని చెప్పి, చివరకు అర్థాంతరంగా పక్కన పెట్టారని ఆరోపించారు.

“ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు లండన్‌లో ఉన్నాను. నాది చాలా కీలక పాత్ర అని చెప్పారు. ఆ తర్వాత లుక్ టెస్టులు, ఫొటోషూట్ నిర్వహించారు. సినిమా ఖరారైన తర్వాత అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నారా రోహిత్‌తో ఐదు రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను. 

అయితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను పిలవలేదు. ఫోన్ చేసి అడిగినా మూడు నెలల పాటు ఎలాంటి స్పందన లేదు. ఆ తర్వాత నా స్థానంలో మరో నటిని తీసుకుంటున్నట్లు చెప్పారు. 

సినిమా విడుదలయ్యాక చూస్తే నేను ఐదు రోజుల పాటు నటించిన సన్నివేశాలకు బదులుగా, కేవలం ఒక చిన్న షాట్ మాత్రమే కనిపించించింది. ఒకవేళ సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం లేదనుకుంటే పూర్తిగా తొలగిస్తే బాగుండేది. కానీ ఇలా ఒక్క సన్నివేశానికి పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగించింది,” అని పూజిత పొన్నాడ అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష