రాజకీయ రౌండప్: 2017

December 26, 2017


img

ప్రతీ సంవత్సరంలాగే 2017 కూడా అనేక తీపి, చేదు జ్ఞాపకాలతో ఉగాది పచ్చడిని తలపిస్తూ త్వరలో ముగియబోతోంది. ముందుగా జాతీయస్థాయి రాజకీయాల గురించి చెప్పుకొంటే, 2016 నవంబరులో చేసిన నోట్ల రద్దు కారణంగా 2017 లోకి చాలా చేదు అనుభవాలతో అడుగుపెట్టాము. సుమారు మూడు నాలుగు నెలలపాటు యావత్ దేశప్రజలందరూ ‘నోట్ల కష్టాలు’ అనుభవించారు. ఆ బాధలు వర్ణనాతీతం. ఆ తరువాత నగదురహిత లావాదేవీలు చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హడావుడిని చూశాం. ఆ వెంటనే జి.ఎస్.టి. బాదుడును రుచి చూశాము. 

ఈ ఏడాదిలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు పదవీ విరమణ చేయగా దళితుడైన రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా, అచ్చమైన తెలుగువ్యక్తి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదవులు చేపట్టారు. 

ఈ ఏడాదిలో వరుసగా పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఒక్క పంజాబ్ తప్ప అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. కనుక భాజపాకు ఈ సంవత్సరం చాలా మేలు చేకూర్చిందని చెప్పవచ్చు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగీ అధిత్యనాద్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో గోవధ నిషేధించారు. అనేక కబేళాలు మూసివేయించారు. ఇదే సమయంలో కేంద్రం కూడా అక్రమంగా గోవుల తరలింపు, అమ్మకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడంతో భాజపా పాలిత రాష్ట్రాలలో ‘గోరక్షక్’ పేరుతో కొంతమంది అతివాదులు చెలరేగిపోయారు.     

వరుస రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత అయనకు కీలకమైన వాణిజ్య శాఖను అప్పగించి, ఇంధనశాఖా మంత్రిగా చేస్తున్న పీయూష్ గోయల్ కు రైల్వేలను అప్పగించబడ్డాయి. రక్షణ మంత్రిగా చాలా సమర్ధంగా పనిచేసిన మనోహర్ పారికర్ ను మళ్ళీ గోవా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం విశేషమే. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ (నిర్మలా సీతారామన్) రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. 

జూన్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మళ్ళీ ఘోర్ఖా ల్యాండ్ ఉద్యమాలు ఉదృతమయ్యాయి. ఈ ఏడాది జూలై నెలలో మొత్తం 37 మంది అమర్ నాథ్ యాత్రికులు ఉగ్రదాడిలో, ప్రమాదాలలో చనిపోయారు. 

ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాశ్మీర్ లో పరిస్థితులు చాలా అదుపులో ఉన్నట్లే చెప్పవచ్చు. ఉగ్రవాదులను, వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేయడానికి భద్రతాదళాలకు కేంద్రం అనుమతించిన కారణంగానే కాశ్మీర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. సుమారు మూడు నెలలకు పైగా భారత్-చైనా దేశాల మద్య డొక్లాం వివాదం నడిచింది. చివరకు చైనా వెనక్కు తగ్గడంతో శాంతియుతంగా సమస్య (తాత్కాలికంగా) పరిష్కారం అయ్యింది.  

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టారు.            

ఇక తమిళనాడులో జయలలిత ఆకస్మిక మృతి తరువాత ఆమె అనుచరురాలు శశికళ అన్నాడిఎంకె పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టబోయి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళారు. అత్యంత వివాదాస్పదుడుగా పేరు మోసిన ఆమె మేనల్లుడు దినకరన్ ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో బారీ మెజార్టీతో గెలవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఉత్తరాది రాష్ట్రాలలో తిరుగు లేకుండా సాగిపోతున్న భాజపా ఈ ఉపఎన్నికలలో డిపాజిట్లు కోల్పోవడం విశేషం. 

ఇక పొరుగు రాష్ట్రంగా మారిన ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది పొడవున వరుసగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రాజధాని నిర్మాణం కంప్యూటర్ గ్రాఫిక్ అంశంగా మిగిలిపోగా, విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులు కాగితాల మీదే మిగిలిపోయాయి. ఇక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడ్డ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే బ్రేకులు వేస్తుండటంతో ప్రస్తుతం చంద్రబాబు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

ఆయన రాజకీయ వారసుడుగా చెప్పుకోబడుతున్న నారా లోకేష్ కు మంత్రి పదవి దక్కింది. అయినా తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలనే తన కోరికను తీర్చుకోవడం కోసం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల పాటు 3,000 కిమీ పాదయాత్ర చేస్తున్నారు. 


Related Post