అయితే మాధవీలతకి రాజాసింగ్ మద్దతు లేన్నట్లేనా?

April 24, 2024


img

హైదరాబాద్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాధవీలత పాతబస్తీతో సహా నియోజకవర్గం పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమె ప్రచారంలో ఎక్కడా ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించడం లేదు. ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్ళినప్పుడు కూడా రాజాసింగ్ ఎక్కడా కనబడలేదు. అంటే ఆమెకు తన మద్దతు లేదని స్పష్టం చేస్తున్నారనుకోవచ్చు. 

ఎందుకంటే, హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్ధిగా ఆమెను ఎంపిక చేస్తున్నప్పుడు బీజేపీ అధిష్టానం తనకు మాట వరసకు చెప్పకపోవడం, తన అభిప్రాయం తీసుకోకపోవడం ఆయనకు చాలా ఆగ్రహం కలిగించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలకమైన ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆమె దరిదాపుల్లో కనిపించడం లేదని భావించవచ్చు. పాతబస్తీలో ఆయన మద్దతు లేకుండా ఆమె గెలవగలరా? 

ఈ ఎన్నికలలో ఎలాగైనా మజ్లీస్‌ అభ్యర్ధి అసదుద్దీన్‌  ఓవైసీని ఓడించి పాతబస్తీలో ఆయనకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా హిందుత్వ అజెండాను గట్టిగా వినిపించే ఆమెను ఏరికోరి ఎంపిక చేసింది. కనుక ఆమెకు రాజాసింగ్ మద్దతు ఈయకపోతే లేదా రాజాసింగ్ సహాయ నిరాకరణ వలన ఆమె ఈ ఎన్నికలలో ఓడిపోతే బీజేపీ అధిష్టానం రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉంటుందా? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తెలుస్తుంది. 


Related Post