రేవంత్ రెడ్డికి వేరే రూల్ ఏమైనా ఉందా? కేటిఆర్

December 25, 2017


img

జడ్చర్ల కాంగ్రెస్ జనగర్జన సభలో రేవంత్ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడంపై మంత్రి కేటిఆర్ కూడా ఈరోజు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి అంతగా దిగజారి నీచమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ‘నీచ్’ అన్నందుకు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారని, మరి రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కేటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మణిశంకర్ అయ్యర్ కు ఒక రూలు, రేవంత్ రెడ్డికి వేరేగా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటిఆర్ డిమాండ్ చేశారు. 

మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి రేవంత్ రెడ్డి ఆవిధంగా మాట్లాడటం తప్పే. అయితే అటువంటి దుసంప్రదాయానికి శ్రీకారం చుట్టింది తెరాసనేనని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నోసార్లు  సీనియర్ కాంగ్రెస్ నేతలను ‘సన్నాసులు..దద్దమ్మలు’ అని అనడం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస నేతలు అనుచితంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. తెరాస ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను దుర్భాషలాడటం, చెంప దెబ్బలు కొట్టినసందర్భాలు కూడా ఉన్నాయి. 

కనుక తెరాస ఒక మెట్టు దిగినందునే ప్రతిపక్షాలు కూడా రెండు మెట్లుదిగవలసి వస్తోందనిచెప్పక తప్పదు. శాసనసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కె.జానారెడ్డి తెరాస నేతలకు తమ బాషను సరిదిద్దుకోమని పదేపదే సూచిస్తుండటం అందరూ గమనించే ఉంటారు. కనుక రాజకీయాలలో ఉన్నవారు అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నాసరే...అందరూ కేవలం ప్రజా సమస్యల పరిష్కారం వరకే తమ చర్చలను పరిమితం చేసినట్లయితే, ఈవిధంగా ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవలసిన అవసరం ఉండదు కదా! 


Related Post