ఆ 16 సీట్లు కాంగ్రెస్ గెలుచుకొని ఉంటే...

December 20, 2017


img

గుజరాత్ ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బొటాబొటి మెజార్టీతో భాజపా గెలవడం అందరికీ తెలిసిందే. భాజపా పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకొన్నప్పటికీ పార్టీ అధిష్టానం ఆ ఫలితాలను చూసి లోలోన ఎంత ఆందోళన చెందిందో ఊహించుకోవచ్చు. గమ్మతైన విషయం ఏమిటంటే ఎన్నికలలో గెలిచిన భాజపా ఆందోళన చెందుతుంటే, ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. అందుకు కారణం ఈసారి ఎన్నికలలో భాజపా గుజరాత్ కంచుకోటకు పగులగొట్టి లోపలకు ప్రవేశించగలిగింది. గత ఎన్నికలతొ పోలిస్తే భాజపాకు సీట్లు గణనీయంగా తగ్గిపోగా, అదేస్థాయిలో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. 

ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “గుజరాత్ ఎన్నికలలో 16 స్థానాలలో కేవలం 3,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయారు. అంటే స్థానికంగా జరిగిన చిన్న చిన్న లోపాల కారణంగానే మా అభ్యర్ధులు ఓడిపోయారని అర్ధం అవుతోంది. అదే..ఆ 16 సీట్లను మేము గెలుచుకొని ఉండి ఉంటే, మేమే గుజరాత్ లో అధికారంలోకి వచ్చేవాళ్ళం. కనుక గుజరాత్ బొటాబొటి సీట్లతో విజయం సాధించిన భాజపా అంతగా సంబరపడిపోవలసిందేమీ లేదు,” అని అన్నారు. 

బొటాడ్ లో 906 ఓట్లు, దోక్లాలో కేవలం 327 ఓట్లు మెజార్టీతో భాజపా అభ్యర్ధులు గెలిచారు. గోద్రాలో కూడా 1,000 కంటే తక్కువ ఓట్ల తేడాతొ భాజపా అభ్యర్ధి గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీకి విజయం చేతికి అందినట్లే అంది జారిపోయిందని స్పష్టం అవుతోంది. 

మొత్తం 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 92 సీట్లు అవసరం కాగా భాజపా కేవలం 99 సీట్లు మాత్రమే గెలుచుకొంది. కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకొంది. 


Related Post