ఆచార్యా...మీకిది తగునా?

December 20, 2017


img

సుమారు మూడున్నర దశాబ్దాలపాటు ప్రొఫెసర్ గా విద్యార్ధులకు పాఠాలు భోదించిన వ్యక్తి ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తే ఏమనుకోవాలి? తెలంగాణా తెలుగు సాహిత్యాన్ని, కళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పి, మాతృబాషను ప్రజలకు, ముఖ్యంగా యువతకు దగ్గర చేసేందుకు జరిగిన ఈ గొప్ప ప్రయత్నాలను ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ కళ్ళద్దాలలో నుంచి చూస్తూ విమర్శలు గుప్పించడం చాలా శోచనీయం. 

ఒక మేధావిగా, గురువుగా ప్రొఫెసర్ కోదండరాం మన తెలుగు బాష, మన కవులు, రచయితలు, వారి రచనల గొప్పదనం, అలాగే మరుగున పడిన మన కళాకారులు వారి కళల గొప్పదనం గురించి తనకు తెలిసిన నాలుగు మంచి ముక్కలు ప్రజలకు చెప్పి ఉండి ఉంటే అందరూ సంతోషించి ఉండేవారు. కానీ అగ్రవర్ణ సంస్కృతిని ప్రజా సంస్కృతిగా, దొరల, పండితుల బాషను ప్రజల బాషగా చిత్రీకరించేందుకే ఈ మహాసభలను నిర్వహించారని చెప్పడం చాలా శోచనీయం. బాషకు, సంస్కృతికి, సాహిత్యానికి, కళలకు కూడా కులం, మతం, ప్రాంతం వంటివి ఆపాదించి వికృత బాష్యం చెప్పడం చాలా బాధాకరమే. 

ఆంధ్రా, తెలంగాణా ప్రజలు మాట్లాడే తెలుగు బాష వేర్వేరని ఒకప్పుడు చెప్పిన కెసిఆరే ఇప్పుడు ఈ మహాసభలను నిర్వహించడం సిగ్గుచేటని కోదండరాం విమర్శించడం అర్ధరహితంగా ఉంది. అంటే కెసిఆర్ ఎప్పటికీ ఆంధ్రావాళ్ళను, వారి బాషను, యాసలను ద్వేషిస్తూనే ఉండాలని కోరుకొంటున్నట్లుంది. రెండు రాష్ట్రాలలో యాసలు వేరైనా మాట్లాడే బాష ఒక్కటే కదా! అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా అనేకమంది బాషాభిమానులు స్వచ్చందంగా తరలివచ్చి ఈ మహాసభలలో పాల్గొన్నారు. వారిని తెలంగాణా ప్రభుత్వం కూడా అంతగానే ఆదరించింది కదా! మేధావులు తమ మేధస్సు, తెలివితేటలను సమాజహితానికి ఉపయోగించాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టడానికి, సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు ఉపయోగించడం సరికాదు.

ఈ మహాసభల నిర్వహణతో తెలంగాణా సాహిత్య, కళా, సాంస్కృతిక గొప్పదనం గురించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పగలిగాము. తెలుగు బాషాభివృద్ధికి దోహదపడే ఎటువంటి ప్రయత్నానయినా అందరూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా గట్టిగా సమర్ధించడం చాలా అవసరం ఉంది. అప్పుడే మన ఉనికిని లోకం కూడా గుర్తిస్తుంది.


Related Post