భాజపా గెలిచింది కానీ...

December 18, 2017


img

కాంగ్రెస్, భాజపాల మధ్య హోరాహోరీగాసాగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనిని ప్రధాని మోడీ చేతిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమిగా చెప్పుకోవచ్చు. అయితే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఓటములు అలవాటయిపోయాయి కనుక ఆయనకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఈ ఎన్నికలతో భాజపా జాబితాలో మరో రాష్ట్రం చేరింది. గుజరాత్ లో వరుసగా మళ్ళీ 6వసారి ఎన్నికలలో విజయం సాధించి అధికారం నిలబెట్టుకొంది. కనుక భాజపా పండగ చేసుకోవడం సహజమే. 

హిమాచల్ ప్రదేశ్ లో భాజపా విజయానికి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కారణంకాగా, భాజపాకు కంచుకోట వంటి గుజరాత్ రాష్ట్రంలో చాలా అవలీలగా బారీ మెజార్టీతో విజయం సాధించవలసిన ఆ పార్టీ కేవలం మోడీ, అమిత్ షా ఎన్నికల వ్యూహాల కారణంగానే చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అతికష్టం మీద గెలిచిందని చెప్పక తప్పదు.

హిమాచల్ ప్రదేశ్ లో భాజపాది అసలు సిసలైన విజయమే కానీ గుజరాత్ లో మాత్రం అది గెలిచి ఓడినట్లు చెప్పక తప్పదు. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరం కాగా భాజపా కేవలం 99 సీట్లు మాత్రమే గెలుచుకోవడమే అందుకు నిదర్శనం. ఈ ఎన్నికలలో కుల రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు తిరస్కరించారని భాజపా నేతలు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ అది ఎంత మాత్రం నిజం కాదని వారికీ తెలుసు. ఎందుకంటే, ఒకవేళ గుజరాత్ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఉంటే దానికి 80 సీట్లు కట్టబెట్టి ఉండేవారు కారు. గుజరాత్ ప్రజలు మోడీ పాలన, సంస్కరణలను చూసి ఓటేసి ఉండి ఉంటే భాజపాకు అంత తక్కువ సీట్లు వచ్చి ఉండేవి కావు. కనుక మోడీ, అమిత్ షాల ‘ఎన్నికల మ్యాజిక్’ కారణంగానే ఈసారి గుజరాత్ లో భాజపా ఒడ్డున పడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. చెమటోడ్చి గెలిచిన అటువంటి విజయం చూసి భాజపా సంబరాలు చేసుకోవచ్చునేమో కానీ ఈ ఫలితాలను ఒక హెచ్చరికగా భావించి, ప్రజలు తమకు బొటాబొటిగా సీట్లు ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలనుకొన్నారు? అని ఆత్మవిమర్శ చేసుకొని పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను గుర్తించి తప్పులు, లోపాలు సరిదిద్దుకొంటే భాజపాకే మంచిది. 


Related Post