ఆగస్ట్ లోగా లక్ష ఉద్యోగాలు భర్తీ?

December 05, 2017


img

టి.ఆర్.టి.ద్వారా ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి  స్పందిస్తూ, “హైకోర్టు ఆదేశాలకు లోబడి అది సూచించిన విధంగానే త్వరలోనే మళ్ళీ 10 జిల్లాల ప్రాతిపదికన టి.ఎస్.పి.ఎస్.సి. నోటిఫికేషన్ జారీ చేస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు టి.ఆర్.టి.దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా డిసెంబర్ 15వరకు పెంచుతున్నాము. రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన జిల్లాలలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం 31 జిల్లాల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలనుకొంది. కానీ రాజకీయ దురుదేశ్యంతో కొందరు చీటికీ మాటికీ కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేస్తూ ఉద్యోగాల భర్తీకి అడ్డుపడుతున్నారు. కొలువుల కొట్లాట సభ నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటో, దాని వెనుక ఎవరున్నారో మాకు తెలుసు. అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంఖించలేరు. ఇప్పటికే 27,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. ఆగస్ట్ 2018 లోగా మిగిలిన 1.08 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తాము,” అని చెప్పారు. 

42 నెలలో కేవలం 27,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయగలిగిన తెరాస సర్కార్, వచ్చే ఆగస్ట్ నెలాఖరులోగా ఏకంగా 1.08 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. కానీ దాని టార్గెట్ అదే అయితే తెరాస చాలా దూరదృష్టితో చాలా తెలివిగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. 

ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన కొత్తలో, మళ్ళీ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. తెరాస కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎంత హడావుడి చేసిందో అందరికీ తెలుసు. మూడున్నరేళ్ళు ఏవో కుంటిసాకులతో తాత్సారం చేసిన తరువాత, 1.08 లక్షల ఉద్యోగాల భర్తీ, 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఒకేసారి గృహాప్రవేశాలు, ఎకరానికి రూ.4,000 చొప్పున ప్రతీ రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బు జమా చేయడం వంటి మూడు పెద్ద కార్యక్రమాలకు ముహూర్తం వచ్చే ఏడాది మే-ఆగస్ట్ మద్య పెట్టుకోవడం గమనిస్తే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస సర్కార్ ఇంతకాలం వీటిపై తాత్సారం చేసిందనే అనుమానం కలుగుతోంది. 

ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక నిరుద్యోగికి ప్రభుత్వోద్యోగం ఇస్తే, ఒక పేద రైతు ఖాతాలో రూ.4,000 వేస్తే..ఒక నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో గృహాప్రవేశం చేయిస్తే ఆ ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. నాలుగున్నరేళ్ళుగా ప్రభుత్వపై ఏర్పడిన వ్యతిరేకత అంతా ‘ఉఫ్’ మని ఊదేసినట్లు మాయం అయిపోవచ్చు. బహుశః ఇదే ఉద్దేశ్యంతో...ఇదే ధీమాతోనే ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా తెరాస సర్కార్ ఏమాత్రం చలించకుండా మీనమేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేసేస్తోందేమో? ఏమో? 


Related Post