కొట్లాట సభ విజయవంతం అయ్యింది.. తరువాత?

December 05, 2017


img

టిజెఎసి అధ్వర్యంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన కొట్లాట సభ విజయవంతం అయ్యింది. ఈ సభకు కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, ఇంకా అనేక ప్రజా సంఘాలు బలపరిచాయి. వాటి ప్రతినిధులు స్వయంగా ఈ సభలో పాల్గొని తెరాస సర్కార్ పై విమర్శల వర్షం గుప్పించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే అసలు కధ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికలలో తెరాసను ఏదోవిధంగా ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే తెరాస ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎవరు చేపట్టినా వారికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ప్రొఫెసర్ కోదండరాంకు అదే ఉద్దేశ్యంతో మద్దతు ఇచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.    

ఇక టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చమని లేదా రాజకీయ పార్టీ స్థాపించాలని టిజెఎసి సభ్యులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం ఇదివరకే చాలాసార్లు చెప్పారు. ఈ సభ విజయవంతం అవడంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ టిజెఎసి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించదలచుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు. కానీ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకొన్నట్లయితే దాని వలన తెరాస కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంది. 

టిజెఎసి ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి ఎన్నికలలో పోటీకి సిద్దమైతే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దానితో ఎన్నికల పొత్తులకు సిద్దపడవలసి ఉంటుంది. అంటే తన సీట్లలో దానికీ భాగం పంచి ఇవ్వాల్సి ఉంటుందన్న మాట. ఒకవేళ అందుకు టి- కాంగ్రెస్ నేతలు ఇష్టపడకపోతే ఇంతకాలం తాము మద్దతు ఇస్తున్న టిజెఎసితోనే పోటీ పడవలసి ఉంటుంది. 

ఒకవేళ టిజెఎసి రాజకీయాలలోకి రాకపోయినా అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి వామపక్షాల నేతృత్వంలో ఏర్పడబోతున్న ‘థర్డ్ ఫ్రంట్’ కు మద్దతు ఇవ్వాలనుకొన్నా కాంగ్రెస్ నష్టపోక తప్పదు. ఇక టిజెఎసికి మద్దతు ఇస్తున్న వామపక్షాలకు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రొఫెసర్ కోదండరాం వాటిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అవి ఎంతో కొంత నష్టపోవడం ఖాయం. అయితే టిజెఎసి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినా రాకపోయినా అది కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలతో చేతులు కలపడం ఖాయంగానే కనిపిస్తోంది కనుక దాని వలన తెరాసకు కూడా కొంత మేర నష్టం జరిగే అవకాశం ఉంది. 

కొట్లాట సభ విజయవంతం అవడంతో ఇప్పుడు టిజెఎసి మరింత శక్తివంతంగా మారింది. కనుక ఇప్పుడు దానికీ ప్రతిపక్షాలకు మద్య సంబంధాలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది చాలా ఆసక్తికరంగా మారబోతోంది. 


Related Post