బాబ్రీపై మజ్లీస్ రాజకీయాలు

December 05, 2017


img

మజ్లీస్ పార్టీ ఒక మతానికే పరిమితమై ఆ మతస్తుల ఓటు బ్యాంక్ పైనే ఆధారపడి నడుస్తున్న మతతత్వ రాజకీయపార్టీ అని అందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కూడా మతం ప్రాతిపదికనే ఆలోచిస్తారు...మాట్లాడుతుంటారు...రాజకీయాలు చేస్తుంటారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మద్య చిచ్చుపెట్టడానికి కూడా వారు వెనుకాడరని అనేకసార్లు రుజువు చేసుకొన్నారు. అందుకు న్యాయస్థానాల చేత చివాట్లు తిన్నారు కూడా. అయినా వారి తీరు మారలేదు. ఇక ముందు కూడా మారబోరు ఎందుకంటే మారితే వారి రాజకీయ ఉనికిని కోల్పోతారు. 

దశాబ్దాలుగా దేశంలో హిందూ-ముస్లింల మద్య ఉద్రిక్తతలకు కారణం అవుతున్న ‘బాబ్రీ మశీదు-అయోధ్య రామమందిరం’ వివాదంపై కోర్టు బయట ఇరువర్గాల ప్రతినిధుల మద్య సామరస్యపూర్వకంగా చర్చలు సాగుతూ, పరిష్కారం దిశలో అడుగులు పడుతున్న ఈ సమయంలో, పార్టీలు, మతాలకు అతీతంగా అందరూ సహకరించాలి. కానీ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మశీదు విద్వంసదినంగా బంద్ పాటించాలని ముస్లింలకు పిలుపునివ్వడం శోచనీయం. 

ముస్లిం యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో వట్టిపల్లిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నేతలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బాబ్రీ మశీదును కూల్చివేసి దానిని రామజన్మభూమి అని వాదిస్తూ వివాదం రాజేశారని, అటువంటివారికి బుద్ధి చెప్పేందుకు రేపు బంద్ పాటించాలని అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు.

రాజకీయ ప్రయోజనాలను ఆశించే భాజపా అనుబంధ సంస్థలు బాబ్రీ మశీదు కూల్చివేసిన మాట వాస్తవమే కావచ్చు కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆ వివాదాన్ని ఇంకా రాజేస్తున్నారని చెప్పక తప్పదు. 

ముస్లింల సంక్షేమం కోసం ఓవైసీ సోదరులు చేసిందేమీ లేకపోయినప్పటికీ, తాము మాత్రమే ముస్లింలను కాపాడగలమన్నట్లు, తామే వారికి ఏకైక ప్రతినిధులమన్నట్లు మాట్లాడుతుంటారు. ముస్లింలపై వారికి నిజంగా ప్రేమాభిమానాలు కలిగి ఉండి ఉంటే, పాతబస్తీలో అభంశుభం తెలియని బాలికలకు అరబ్ షేక్ లతో నిఖాలు జరిగి ఉండేవి కావు. ఉన్నత విద్యలభ్యసించిన ముస్లిం యువత ఉద్యోగాలు, ఉపాధి లభించక దారి తప్పి ఉండేవారు కారు. పాతబస్తీ, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో లక్షలాది ముస్లిం కుటుంబాలు దయనీయమైన పరిస్థితులలో భారంగా జీవితాలు నెట్టుకు వస్తున్నాయి. వారి సంక్షేమం కోసం ఓవైసీ సోదరులు చేసిందేమీ లేదు. కానీ వారిని ఉపయోగించుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు. పాతబస్తీలో ముస్లింలనే ఆదుకోలేని ఓవైసీ సోదరులు యావత్ దేశంలో ముస్లింలను ఉద్దరిస్తామన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది కదా? 


Related Post