ప్రభుత్వోద్యోగం రాకపోతే జీవితం వ్యర్ధమేనా?

December 04, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సోమవారం సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ జరుగబోతోంది. వివిధ ప్రభుత్వ శాఖలలో గల ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని కోరుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. 

వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేయమని కోరడం తప్పు కాదు కానీ అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించడం సాధ్యమేనా? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రైవేట్ ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వోద్యోగాలలో ఆదాయం, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి అనేక ఇతర సదుపాయాలు లభిస్తాయి కనుకనే అందరూ వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఉద్యోగం అంటే ప్రభుత్వోద్యోగమేననే భ్రమలు యువతకు కల్పించడం సరికాదు. 

తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలలో చాలామంది యువతీ యువకులు తగిన అర్హతలు సంపాదించుకొని, పట్టుదలగా ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నాలలో వారు చాలా ఏళ్ళపాటు ఒక తపస్సు మాదిరిగా కృషి చేస్తుంటారు. ఉద్యోగం సాధిస్తే వారి ఆనందానికి హద్దులు ఉండవు కానీ ఏ కారణాల చేతైనా సాధించలేకపోతే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 

ఉన్నతవిద్యలభ్యసించినా ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతే తల్లితండ్రులకు భారంగా మారామనే భావన యువతలో కలగడం సహజమే. అయితే ‘ఉద్యోగం అంటే ప్రభుత్వోద్యోగమే’ అనే భావన నుంచి బయటపడి, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలపై కూడా దృష్టిసారిస్తే వారికి అనేక అవకాశాలు కనిపిస్తాయి. 

దాదాపు ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యువతను స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడానికి చాలా ప్రోత్సహిస్తున్నాయి. కనుక ప్రైవేట్ ఉద్యోగాలే కాకుండా స్వయంగా ఏదైనా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. 3-4 దశాబ్దాల క్రితం దేశంలో ఇన్ని రకాల ఉద్యోగావకాశాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అనేక కొత్త కొత్త రంగాలలో కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకువచ్చాయి. 

ఉదాహరణకు బాగా వంటలు చేసే నేర్పు ఉంటే హోటల్ ఇండస్ట్రీ స్వాగతం పలుకుతోంది. బాగా బొమ్మలు గీయగలిగినవారు యానిమేషన్ లో నైపుణ్యం సాధిస్తే సినీ, ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశాలున్నాయి. పెద్దగా చదువుకోకపోయినా మంచి వాక్చాతుర్యం ఉన్నట్లయితే ప్రైవేట్ టీవి, రేడియో ఛానల్స్, రాజకీయాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో ‘మొబైల్’ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కనుక మొబైల్ ఫోన్స్ రిపేర్ లేదా యాప్స్ తయారుచేయడం వచ్చినా ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా బ్రతికేయవచ్చు. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న యువత, దానిని తమ జీవితాలకు ఏవిధంగా ఉపయోగించుకోవచ్చుననే విషయం తెలుసుకోగలిగితే వారికి అనేక ఉద్యోగ, ఉపాధి మార్గాలు కనిపిస్తాయి. 

ఉదాహరణకు యూ ట్యూబులో ‘తెలుగు టెక్ ట్యూట్స్’ నిర్వహిస్తున్న రామగుండానికి చెందిన ఎస్.డి.హఫీజ్ గురించి చాలా మంది వినే ఉంటారు. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ గురించి తనకు తెలిసిన విషయాలను వీడియోగా రూపొందించి యూ ట్యూబ్ లోకి అప్-లోడ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. అందుకోసం అతని వద్ద పెద్ద ఆఫీస్, ఉద్యోగులు ఎవరూ లేరు. రామగుండం మండలం యైటింక్లయిన్‌కాలనీలో గల తన కంప్యూటర్ సెంటర్ లో వీడియో క్లాసులను చిత్రీకరించి యూ ట్యూబ్ లోకి అప్-లోడ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.

 ఈవిధంగా ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగ ఉపాధి మార్గాలున్నప్పుడు, ప్రభుత్వోద్యోగం దొరకలేదనే నిరాశ నిస్పృహలతో యువత ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు. వారు నిరాశలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతల మాటలను చెవికెక్కించుకోవడం కంటే ప్రైవేట్ రంగంలో ఈవిధంగా విజయాలు సాధించినవారి నుంచి స్ఫూర్తి, వారి సలహా, సహాయ సహకారాలు పొందే ప్రయత్నాలు చేస్తే మంచిది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి మార్గాల గురించి సోషల్ మీడియా ద్వారా కూడా సమాచార సేకరణ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి సమస్యకైనా గూగుల్ లేదా సోషల్ మీడియాలో చక్కటి సమాధానాలు, చాలా విలువైన సలహాలు, సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ప్రతీ సమస్యపై లోతుగా చర్చించి పరిష్కారాలు సూచించే చర్చా వేదికలున్నాయి. కనుక ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో చదువుకొని ప్రిపేర్ అయిన యువత కూడా అది సాధించేవరకు ప్రైవేట్ రంగంలో ఏదో ఒక ఉద్యోగం లేదా ఉపాధి సంపాదించుకోవడం చాలా మంచిది.

వివిధ రంగాలలో గ్రామీణ మహిళలు కూడా రాణిస్తున్నప్పుడు పీజిలు, ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన విద్యార్ధులు ఉద్యోగం దొరకలేదని ఆత్మహత్య చేసుకోవడం సమంజసమేనా? అని ఆలోచిస్తే మంచిది. ప్రభుత్వోద్యోగం సాధించలేకపోతే జీవితం వ్యర్ధం అని అనుకోవడం చాలా తప్పు. 

చదువు, ఉద్యోగం రెండూ కూడా మనిషి తన జీవనం సాగించేందుకు అవసరమైన విజ్ఞానం, ఆదాయమార్గాల కోసమే తప్ప అవే జీవితం కాదు. ఒకసారి సమాజంలో మన చుట్టూ ఉన్నవారిని నిశితంగా పరిశీలించి చూసినట్లయితే ఉన్నత చదువులు, ప్రభుత్వోద్యోగం రెండూ లేకపోయినా చాలా హాయిగా సుఖంగా బ్రతికేస్తున్నవారు కోకొల్లలు ఉన్నారని తెలుస్తుంది. కనుక ప్రభుత్వోద్యోగమే రావాలి అని అనుకోకుండా జీవితం సాగించడానికి ఏమేమి మార్గాలున్నాయో వాటన్నిటి గురించి యువత తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. 


Related Post