జిఈఎస్ సక్సెస్..రాజకీయాలు షరా మామూలే!

December 02, 2017


img

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఏంట్రప్రీన్యువర్ సదస్సు ఊహించినదాని కంటే గొప్పగా జరుగడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సహా ఈ సదస్సుకు హాజరైన దేశవిదేశాల ప్రతినిధులు అందరూ తెలంగాణా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా.. ఈ సదస్సు ఇంత అద్భుతంగా, సజావుగా, అర్ధవంతంగా సాగడానికి ప్రధాన కారకుడైన రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ ను అందరూ అభినందిస్తున్నారు. 

ఈ సదస్సుకు హాజరైన కేంద్ర డి.ఓ.పి.టి. కార్యదర్శి అరుణా సుందర్ రాజన్ కేటిఆర్ ను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలు విన్నట్లయితే సదస్సుకు విచ్చేసిన వారందరికీ ఆయన గురించి ఎంత గొప్ప అభిప్రాయం ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. “కేటిఆర్ సాబ్.. మిమ్మల్ని క్లోనింగ్ చేయగలిగే అవకాశం ఉంటే బాగుండేది. మీ ప్రతిరూపాన్ని దేశంలో మిగిలిన 28 రాష్ట్రాలు ఉపయోగించుకోగలిగి ఉండేవి,” అని అన్నారు. ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదేమో?

అయితే ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీల మోత’ అన్నట్లు, దేశవిదేశాల ప్రతినిధులు కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని, మంత్రి కేటిఆర్ ను ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం యధాప్రకారం విమర్శలు గుప్పించాయి. “ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేసి చివరికి సాధించింది ఏమిటంటే, తన కొడుకు కేటిఆర్ ఇమేజ్ ఇంకా పెరిగేలా చేయగలిగారు. అంటే కొడుకును ప్రమోట్ చేయడానికే ఇంత ప్రజాధనం ఖర్చు చేశారన్నమాట. ఈ సదస్సు అంతా ‘కేటిఆర్ లైవ్ షో’ అన్నట్లు నడిపించారు. ప్రతిపక్ష నేతలెవరినీ కనీసం మర్యాద కోసమైనా ఆహ్వానించలేదు,” అని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు.

ప్రతిపక్షాల విమర్శలపై తెరాస ఎంపి బాల్కా సుమన్ ఘాటుగా స్పందించారు. ఈ సదస్సును ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు దేశవిదేశాల ప్రతినిధులు అందరూ మంత్రి కేటిఆర్ ను అభినందిస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అది చూసి అసూయతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఐటి శాఖకు కేటిఆర్ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటి నుంచే ఐటి ఎగుమతులు ఊపందుకొన్నాయి. అనేక చిన్నాపెద్ద ఐటి కంపెనీలు, వ్యాపార సంస్థలు తెలంగాణాకు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో ఐటి రంగంలో అభివృద్ధి అందరూ చూడగలుగుతున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం చూడలేకపోతున్నాయి. ఓర్వలేకపోతున్నాయి. ప్రతిపక్షాలు ఎంతగా ఏడ్చుకొన్నా మా ప్రభుత్వం వాటి ఎదుపులను పట్టించుకాదు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూనే ఉంటుంది. ప్రతిపక్షాలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 


Related Post