కాపులకు 5 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం

December 02, 2017


img

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు విద్య, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఏపి సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లును ఈరోజు ఏపి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాపులకు బిసి (ఎఫ్) కేటగిరీలో చేర్చుతూ నిర్ణయం తీసుకొన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసిలలో చేర్చుతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఇల్లలకాగానే పండుగ కాదన్నట్లుగా, కాపులను బిసిలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏపిలోని బిసి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగపరంగా అన్నివిధాల ఉన్నతస్థాయిలో ఉన్న కాపులను బిసిలలో చేర్చడం వలన తాము నష్టపోతామని కనుక ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇక కాపులను బీసిలలో చేర్చడంతో రిజర్వేషన్ల గరిష్టస్థాయి 50 శాతం కంటే మించిపోయి ఇప్పుడు 55 శాతం అయ్యింది కనుక ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అయ్యింది. కనుక ఏపి సర్కార్ బంతిని మోడీ కోర్టులో పడేసి చేతులు దులుపుకొంది. మోడీ సర్కార్ దానికి పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయిస్తే తప్ప అది ఆచరణలోకి రాదు కనుక అంతవరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు లభించడం కూడా సాధ్యం కాదు. కానీ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా తమ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించామని తెదేపా నేతలు గొప్పలు చెప్పుకోవచ్చు. దాని కోసం అప్పుడప్పుడు హడావుడి చేస్తున్న  ముద్రగడ పద్మనాభానికి, ఆయనకు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న వైకాపాకు దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టవచ్చు.        



Related Post