గురువులకు శిక్షలా..ఇదేం చోద్యం?

December 02, 2017


img

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉద్దేశ్యించి రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ “ఈసారి 10వ తరగతి విద్యార్ధులు ఏఏ సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయితే అది ఆయా సబ్జెక్ట్ లను భోదిస్తున్న ఉపాధ్యాయుల వైఫల్యం, అలసత్వంగానే భావించి వారిపై బదిలీ వేటు వేస్తాము. కనుక 10వ తరగతి విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించేలా కృషి చేయాలి,” అని కోరారు.    హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతి విద్యార్ధులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపమని మంత్రిగారు కోరడం తప్పు కాదు కానీ విద్యార్ధులు ఫెయిల్ అయితే దానికి ఉపాద్యాయులను శిక్షిస్తానని చెప్పడమే తప్పు. 

ఏ ఉపాద్యాయుడైనా తన విద్యార్ధులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తే అది తన విజయంగానే భావించి సంతోషిస్తారు. కనుక నిత్యం అందుకు తగ్గట్లుగానే విద్యార్ధులను సాన పెడుతుంటారు. కానీ కొందరు విద్యార్ధులు వివిద కారణాల వలన చదువులలో వెనుకబడి ఉండవచ్చు లేదా చదువులపై ఆసక్తి చూపకపోవచ్చు. అటువంటి విద్యార్ధులను కూడా సరిచేయడం తమ బాధ్యతగానే భావించి ఉపాద్యాఉలు నిరంతరం కృషి చేస్తుంటారు. కనుక విద్యార్ధుల వైఫల్యానికి గురువులను శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి హెచ్చరించడం సరికాదు. 

నేటికీ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలలో కనీస సౌకర్యాలు కూడా లేని సంగతి మంత్రిగారికి తెలియదనుకోలేము. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒకవేళ ఇదే నియమాన్ని ప్రభుత్వానికి కూడా వర్తింపజేసి చూసుకొంటే, ప్రభుత్వ వైఫల్యాలకు పొరపాట్లకు ఒక్కో ప్రజా ప్రతినిధి వందలసార్లు రాజీనామాలు చేసి ఉండాలి. 


Related Post