చంద్రబాబు ఏమి చేస్తారో ఏమో?

November 30, 2017


img

చంద్రబాబు నాయుడు ఏపిలో అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక సమస్యలు నెలకొని ఉన్నప్పటికీ, అభివృద్ధిలో పోటీ పడుదామని తెరాస సర్కార్ సవాలు విసిరేవారు. చంద్రబాబు ఏపిని కొంతవరకు గాడిలో పెట్టగలిగిన మాట వాస్తవం. అలాగే రాష్ట్రంలో మౌలికవసతులు అభివృద్ధి చేసిన మాట కూడా వాస్తవమే. కానీ ఆర్ధిక,రాజకీయ పరిమితుల కారణంగా నేటికీ రాజధాని నిర్మాణం మొదలుపెట్టలేక, రాజధాని రైతులను సింగపూర్ పిక్నిక్ పంపించి చేతులు దులుపుకొన్నారని జగన్ విమర్శిస్తున్నారు. పోలవరానికి అవరోధాలు ఎదురవుతుంటే ఏమి చేయాలో పాలుపోక, శాసనసభ్యులను అక్కడికి పిక్నిక్ తీసుకువెళ్ళారని విమర్శిస్తున్నారు. 

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభం అయిపోయాయి కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు కనీసం శంఖుస్థాపన కూడా జరుగలేదు. ఒకప్పుడు ఐటి పితామహుడిగా పేరు సంపాదించుకొన్న చంద్రబాబు, ఇప్పుడు ఐటి రంగంలో తెలంగాణా రాష్ట్రంతో పోటీ పడలేకపోతున్నారు. సుమారు నాలుగేళ్ళవుతున్నా రాష్ట్రంలో ఒక్క పెద్ద ఐటి పరిశ్రమ కూడా రాలేదు. పారిశ్రామిక రంగంలో కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగకపోవడంతో నేటికీ ఏపిలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఇక విభజన చట్టంలో విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేస్తామని కేంద్రం ఏపికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ చంద్రబాబు కనీసం దానినీ సాధించలేకపోయారు. ఇక ‘ప్రత్యేక హోదా’ ఒక అభూతకల్పనగా మిగిలిపోయింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఏపిలో పారిశ్రామిక అభివృద్ధి అన్ని మాటలకు, కాగితాలకే పరిమితం అయిపోయాయి. కేంద్రం మంజూరు చేసిన ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల శంఖుస్థాపనలకు కొబ్బరికాయలు పగిలాయి కానీ నాలుగేళ్ళు కావస్తున్నావాటి నిర్మాణపనులు మొదలుకాలేదు. ఈవిధంగా హామీలన్నీ ఫైళ్ళలోనే భద్రంగా ఉండిపోయాయి. 

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంతో కోట్లాడి అన్నీ సాధించుకోగలుగుతున్నారు కానీ ఏపి సిఎం చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా, వినయవిధేయతలతో మెలుగుతున్నా ఏమీ సాధించలేకపోతున్నారనేది జనాభిప్రాయం. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపనుల గురించి, సాధించిన విజయాల గురించి గొప్పగా, గట్టిగా, గర్వంగా చెప్పుకొని వచ్చే ఎన్నికలలో తమకు తిరుగులేదని బల్లగుద్ది చెప్పగలుగుతున్నారు. చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికలలో తామే గెలుస్తామని గట్టిగానే చెప్పుకొంటున్నప్పటికీ అందుకు బలమైన కారణాలు చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ కేటిఆర్ రాజకీయంగా, పాలనాపరంగా తన సత్తా నిరూపించుకొంటూ నానాటికీ కెసిఆర్ కు తీసిపోని బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అక్కడ ఏపిలో నారా లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టినా రాణించలేకపోతున్నారు. లోకేష్ కూడా కేటిఆర్ లాగ రాణించి ఉండి ఉంటే చంద్రబాబుకు నిశ్చింతగా ఉండేది. కానీ ఈ విషయంలోనూ బాబుకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.

ఈ నేపధ్యంలో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి అప్పుడే పాదయాత్రలతో జనాలలోకి వెళ్ళిపోయి బాబు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, అప్పుడే ఎడాపెడా ఎన్నికల హామీలు గుప్పించేస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలు తెదేపాకు అగ్నిపరీక్షగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు వాటిని ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.


Related Post