మోడీ నోట తెలంగాణా విమోచన పోరాటం!

November 28, 2017


img

ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బేగం పేట విమానాశ్రయ ఆవరణలో రాష్ట్ర భాజపా నేతలు ఏర్పాటు చేసిన చిన్న సభలో మాట్లాడుతూ, “నాకు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గుర్తుకువస్తుంటారు. నిజాం నవాబుల నుంచి తెలంగాణా విమోచనం కోసం తెలంగాణా ప్రజలు చాలా పోరాటాలు చేశారు. ఆయన నిజాం నవాబు చేతిలో నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి భారతదేశంలో విలీనం చేశారు. ఈ వీరభూమికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెలంగాణా విమోచన కోసం అనేకవేల మంది ప్రాణాలు అర్పించారు. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తెలంగాణా ప్రజలందరికీ అభినందనలు. కేంద్రం తరపున తెలంగాణా రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తాము. తెలంగాణాలో భాజపా అధికారంలో లేకపోయినప్పటికీ రాష్ట్ర భాజపా నేతలు, కార్యకర్తలు నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తున్నారు. అందుకు వారినందరినీ కూడా అభినందిస్తున్నాను,” అని అన్నారు.

తెలంగాణా సాధన కోసం జరిగిన పోరాటాల గురించి మాట్లాడితే ఆ క్రెడిట్ కాంగ్రెస్, తెరాసలకు కూడా దక్కుతుంది కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ సహా అందరూ తప్పకుండా సంతోషించి ఉండేవారు. కానీ ప్రధాని మోడీ రాష్ట్ర భాజపా వైఖరికి అనుకూలంగా దశాబ్దాల క్రితం జరిగిన తెలంగాణా విమోచన పోరాటాల గురించి మాట్లాడారు. అంటే రాష్ట్రంలో భాజపా వైఖరి అదేవిధంగా ఉండబోతోందని సూచించినట్లు భావించవచ్చు. 

అయితే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని తెరాస సర్కార్ అధికారికంగా జరుపడం లేదని ఏడాదికి ఓసారి హడావుడి చేయడం వలన భాజపాకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం కలుగదని చెప్పక తప్పదు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలంటే, భాజపా చాలా గట్టిగా కృషి చేయాల్సి  ఉంటుంది. తెరాసకు ఇబ్బంది కలిగించే తెలంగాణా విమోచన దినోత్సవం గురించి మాట్లాడిన ప్రధాని మోడీ ఆ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటిఆర్ తదితరులతో కలిసి తదుపరి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మెట్రో రైల్లో మంత్రి కేటిఆర్ ను పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్పుకొన్నారు. అక్కడ భాజపా పార్టీ నేతగా మాట్లాడారు. ఇక్కడ దేశప్రధానిగా వ్యవహరించారని సరిపెట్టుకోవచ్చు. అయితే తెలంగాణా విమోచన పోరాటాల గురించి రెండు ముక్కలు మాట్లాడినంత మాత్రాన్న రాష్ట్ర భాజపాకు కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదని అందరికీ తెలుసు.  


Related Post