ఆలస్యానికి జియో బారీ మూల్యం?

November 28, 2017


img

ఒక ఏడాది క్రితం జియో ఒక సంచలనం. 4-5 నెలల క్రితం జియో 4జి ఫీచర్ ఫోన్ మరో సంచలనం. కానీ ఇప్పుడు ఆ రెండూ మిగిలిన అన్ని టెలికాం సేవలు, మొబైల్ ఫోన్స్ లాగే సర్వసాధారణమైనవిగా మారిపోయాయి. 

జియో తన ప్రత్యేకతను కోల్పోవడానికి ప్రధాన కారణం దాని సేవల ఖరీదు పెంచడం, గడవుకాలం కుదించడం అని చెప్పవచ్చు. ఈ రెండు చర్యలతో జియో ధరలు కూడా ఇతర టెలికాం కంపెనీల స్థాయికి వచ్చేశాయి. గత ఏడాదిన్నర కాలంగా జియో దెబ్బకు బారీగా నష్టపోయిన ఇతర టెలికాం కంపెనీలన్నీ దీనిని అవకాశంగా మలుచుకొని అవి కూడా జియోకు ధీటుగా పోటీగా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించడం ద్వారా తమ పాత వినియోగదారులను వెనక్కు రప్పించుకొని మళ్ళీ చేజారిపోకుండా నిలుపుకోగలుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ తో సహా దేశంలో అన్ని టెలికాం కంపెనీలు మళ్ళీ జియోకు సవాలు విసురుతున్నాయి. కనుక ఆ సవాళ్ళను తట్టుకోవడానికి జియో మళ్ళీ ధరలు తగ్గించలేదు. తగ్గిస్తే అదే నష్టపోతుంది. 

ఇక జియో 4జి ఫీచర్ ఫోన్ అమ్మకాలు మొదలుపెట్టినప్పుడు వాటికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది ఆ ఫోన్లకు ఆర్డర్ పెట్టారు. కానీ అన్ని ఫోన్లను ఒకేసారి సరఫరా చేయలేక జియో చేతులు ఎత్తేసింది. మళ్ళీ ఫోన్లను సమకూర్చుకొని ప్రజల ముందుకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. జియోకు గట్టి పోటీనిస్తున్న ఎయిర్ టెల్, వోడా ఫోన్ వంటి టెలికాం కంపెనీలు అంతకంటే లేటెస్ట్ మోడల్స్4జి ఫీచర్ ఫోన్లను, ఇంచుమించు అదే ధరలకు జియో కంటే ముందుగా మార్కెట్ లోకి విడుదల చేశాయి. దాంతో వాటి వినియోగదారులు జియో వైపు వెళ్ళకుండా నిలుపుకోగలిగాయి. 

కనుక ఇప్పుడు జియో 4జి ఫీచర్ ఫోన్స్ సరఫరా చేస్తామని మెసేజ్ లు పెడుతున్నా బుక్ చేసుకొన్నవారి నుంచి మొదట వచ్చినంత స్పందన రావడం లేదని సమాచారం. ఒకవేళ అప్పుడే జియో కోటి మందికి కాకపోయినా కనీసం 50-60 లక్షల మందికి 4జి ఫీచర్ ఫోన్స్ సరఫరా చేయగలిగి ఉండి ఉంటే, నేడు జియోకు అంత మంది వినియోగదారులు ఉండేవారు. అంటే ఫోన్ల సరఫరాలో ఆలస్యం వలన అంతమంది వినియోగదారులను, ఆ మేరకు బిజినెస్ కూడా జియో కోల్పోయిందన్న మాట. 

అయితే ఇందుకు జియో తనను తానే నిందించుకోక తప్పదు. జియో మొదటి నుంచే విద్వంసకర ధోరణిని అవలంభిస్తూ, మార్కెట్ లో తన పోటీదారులను పూర్తిగా తుడిచిపెట్టేసి దేశంలో ఏకచత్రాధిపత్యం చేయాలని కలలుకంది. ఆ ప్రయత్నంలో అది కొంతవరకు విజయవంతం అయ్యింది కూడా. కానీ చివరకు మిగిలిన కంపెనీలలో ఒకటిగానే నిలబడవలసి వచ్చినట్లు కనిపిస్తోంది. 



Related Post